పాక్ శాంతి చర్చలు ఎందుకు కోరుకొంటోంది?

June 08, 2019
img

ఈనెల 13,14 తేదీలలో కిర్జిస్తాన్ రాజధాని బిషక్‌లో ఎస్.సీ.ఓ.సదస్సులో భారత్‌, పాక్‌ ప్రధానులు పాల్గొననున్నారు. ఆ సందర్భంగా వారిరువురూ భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక అంశాలపై మాట్లాడుకోవచ్చునని ఇరుదేశాల మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. భారత్‌ వాటిని ఖండించిన మరుసటిరోజే పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ భారత్‌ ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ వ్రాశారు. దానిలో కశ్మీర్‌ అంశంతో సహా ఇరుదేశాలకు సంబందించిన అన్ని సమస్యలపై మాట్లాడుకొందామని కోరారు. ఇరుదేశాల మద్య సంబందాలు బలపడాలంటే చర్చలే ఏకైక మార్గమని, సమస్యలను సమరస్యంగా పరిష్కరించుకొంటే ఇరుదేశాల అభివృద్ధి సాధ్యపడుతుందని ఇమ్రాన్ ఖాన్‌ వ్రాశారు.   

అయితే పాక్‌ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగమని భారత్‌ వాదిస్తుంటే, భారత్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఏనాటికైనా భారత్‌ నుంచి విముక్తి కల్పించడమే తమ లక్ష్యమని పాక్‌ నేతలు వాదిస్తున్నారు. పైగా అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ఒక సమస్యగా చిత్రీకరిస్తూ భారత్‌ను దోషిగా చూపేందుకు దశాబ్ధాలుగా ప్రయత్నిస్తున్నారు. మరోపక్క కశ్మీర్‌లో వేర్పాటువాదులను ప్రోత్సహిస్తూనే, ఉగ్రవాదులకు దాడులు చేయడానికి అవసరమైన సహాయసహకారాలు పాక్‌ అందజేస్తోంది. ఇటువంటి వైఖరితో వ్యవహరిస్తున్న తమతో శాంతి చర్చలు ఏవిధంగా సాధ్యమని ఇమ్రాన్ ఖాన్‌ ఆలోచించాలి తప్ప భారత్‌ కాదు. ఇంత చిన్న విషయం పాక్‌ పాలకులకు తెలియదనుకోలేము కానీ తెలియనట్లు నటిస్తూ, తమ శాంతిప్రతిపాదనలకు భారత్‌ అంగీకరించడంలేదని అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు పాక్‌ ఇటువంటి చౌకబారు ప్రయత్నాలు చేస్తోంది. 

Related Post