వైట్ హౌస్ ముందు ప్రవాసభారతీయుడు ఆత్మహత్య

May 31, 2019
img

అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ సమీపంలో అర్ణవ్ గుప్తా(33) అనే ప్రవాసభారతీయుడు ఒంటికి నిప్పంటించుకొని సజీవ దహనం అయ్యాడు. అమెరికా కాలమాన ప్రకారం ఈ సంఘటన బుదవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగింది. మేరీలాండ్‌లో నివసిస్తున్న అర్ణవ్ గుప్తా బుదవారం సాయంత్రం వైట్ హౌస్ సమీపంలో గల ఎలిప్స్ పార్కుకు వచ్చి అక్కడ అందరూ చూస్తుండగానే ఒంటికి నిప్పంటించుకొన్నాడు. అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అతనిని తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ మంటలలో తీవ్రంగా గాయపడటంతో మృతి చెందాడు. 

బుదవారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళిన అతను ఎంతకూ తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు మేరీలాండ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని గురించి పోలీసులకు పూర్తి సమాచారం లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని ఆత్మహత్యకు కారణాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు. బహుశః మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం లేదా కుటుంబ కలహాలు, ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని గురించి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Related Post