గల్ఫ్ కష్టాలు: మొన్న వీరయ్య నేడు సమీర్

May 15, 2019
img

అబుదాబీ ఎడారిలో ఒంటరిగా ఒంటెలను కాపలాకాస్తూ నరకయాతన అనుభవిస్తున్న కరీంనగర్‌కు చెందిన వీరయ్య అనే వ్యక్తి తనను రక్షించమని వేడుకొంటూ మొబైల్ ఫోన్ ద్వారా ఒక మెసేజ్ పంపగానే దానిపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌  వెంటనే స్పందించి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి ఈ విషయం తీసుకువెళ్ళడంతో ఆమె చొరవ తీసుకొని వీరయ్యను ఆ నరకం నుంచి బయటకు రప్పించగలిగారు. గల్ఫ్ దేశాలలో ఆవిధంగా నరకయాతన అనుభవిస్తున్న వీరయ్యలు, వీరమ్మలు చాలామందే ఉన్నారు. వారి దీనగాధలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. 

కరీంనగర్ జిల్లాలో ఇల్లంతకుంటకు చెందిన మహ్మద్ సమీర్ (21) కధ కూడా ఇంచుమించు వీరయ్య కధ వంటిదే. అతను కూడా తన దీనగాధను రహస్యంగా మొబైల్ ఫోన్లో రికార్డింగ్ చేసి తెలుగు మీడియాకు పంపాడు. తాను నిజామాబాద్‌కు చెందిన ఏజంట్ చేతిలో మోసపోయి సౌదీ అరేబియాకు వెళ్ళి చిక్కుకుపోయానని చెప్పాడు. సౌదీలో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెపితే ఏజంటుకు రూ. 80,000 ఇచ్చానని కానీ అతను తనను మోసం చేశాడని చెప్పాడు. ఇక్కడ ఒక నిర్జన ఎడారిప్రాంతంలో ఒంటరిగా గొర్రెలను కాస్తున్నానని చెప్పాడు. గొర్రెల యజమాని రోజు తనను కొడుతుంటాడని, తిండి కూడా పెట్టడంలేదని కన్నీళ్లు పెట్టుకొంటూ చెప్పాడు. “ఈ నరకం నుంచి నన్ను ఎలాగైనా బయటకు తీసుకువెళ్ళు కేటీఆర్‌ అన్నా...నన్ను ఇండియాకు రప్పించు అన్నా” అంటూ కన్నీటితో మొరపెట్టుకొన్నాడు. మహ్మద్ సమీర్‌ను కూడా కేటీఆర్‌, సుష్మాస్వరాజ్ ఆడుకోగలిగితే అతని ప్రాణాలు కాపాడినవారవుతారు. 

ఈవిధంగా కాపాడమని మెసేజ్ పంపగలిగిన వారిని మాత్రమే కాపాడే బదులు, రాష్ట్రం నుంచి ఎంతమంది గల్ఫ్ దేశాలకు వెళ్లారో వారి వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యుల ద్వారా వారి పరిస్థితి గురించి తెలుసుకొని, ఈవిధంగా గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయినవారిని వెనక్కు రప్పించేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేస్తే ఎంతోమందికి పునర్జన్మ ఇచ్చినట్లవుతుంది. అలాగే గల్ఫ్ దేశాలకు వెళ్ళేవారందరూ విధిగా తమ వివరాలను ఆ వ్యవస్థలో నమోదు చేసుకొనేలా చేసి, ఎప్పటికప్పుడు వారి క్షేమసమాచారాలు తెలుసుకోగలిగితే ఈవిధంగా తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోకుండా కాపాడుకోవచ్చు. 

Related Post