పాకిస్థాన్‌లో ఉగ్రదాడి

May 11, 2019
img

ఉగ్రవాదులకు నిలయంగా మారిన పాకిస్థాన్‌లో శనివారం సాయంత్రం ఉగ్రదాడి జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని గ్వాడర్ పోర్ట్ సిటీ వద్ద గల పెరెల్ కాంటినెంటల్ అనే స్టార్ హోటల్లోకి ముగ్గురు ఉగ్రవాదులు భారీగా మారణాయుధాలతో ప్రవేశించి హోటల్ సిబ్బందిని, హోటల్లో బస చేసిన విదేశీయులను బందీలుగా పట్టుకొన్నట్లు సమాచారం. ఈ సమాచారం అందగానే పోలీసులు, భద్రతాదళాలు, ఉగ్రవాద నిరోధక ప్రత్యేకబృందాలు హోటల్ ను చుట్టుముట్టి లోపల ఉన్నవారిని విడిపించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. వారిని నిలువరించేందుకు లోపల నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. హోటల్ వెనుక ద్వారాల గుండా హోటల్లో బస చేసినవారిలో 95 శాతం మందిని సురక్షితంగా బయటకు తరలించామని బలూచిస్తాన్  రాష్ట్ర సమాచార మంత్రి జహూర్ బులెడీ మీడియాకు తెలిపారు. 

ఉగ్రవాదులు హోటల్లోకి ప్రధానద్వారం గుండానే ప్రవేశిస్తునప్పుడు, వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరుపడంతో ఇద్దరు సెక్యూరిటీగార్డులు చనిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మద్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. 


బలూచిస్తాన్‌ గుండా ‘చైనా-పాక్‌ అంతర్జాతీయ ఎకనామిక్ కారిడార్’ పేరిట 50 బిలియన్ డాలర్లతో చైనా భారీ రోడ్డు నిర్మాణపనులు చేస్తోంది. కనుక చైనాకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తరచూ ఆ హోటల్లో బస చేస్తుంటారు. కనుక ఉగ్రవాదులు వారినే లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ పాల్పడిందో ఇంకా తెలియవలసి ఉంది. 

Related Post