అమెరికాలో ఐ‌టి కంపెనీల న్యాయపోరాటం

May 10, 2019
img

హైదరాబాద్‌లో ఐ‌టి కంపెనీలు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరును సృష్టిస్తున్నట్లే అమెరికాలో ఐ‌టి కంపెనీ కూడా ఆ దేశఆర్ధికప్రగతిలో అత్యంత కీలకంగా నిలుస్తున్నాయి. అమెరికా అభివృద్ధికి దోహదపడుతున్న ఐ‌టి కంపెనీలకు మరింత తోడ్పడవలసిన ట్రంప్ సర్కార్ హెచ్-1బీ వీసాల పేరుతో వాటిని ముప్పతిప్పలు పెడుతోంది. 

ట్రంప్ నిర్ణయాలకు అనుగుణంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యుఎస్.సిఐఎస్) హెచ్-1బీ వీసా నిబందనలలో ఇష్టారాజ్యంగా మార్పులు చేర్పు చేస్తోంది. దాంతో ఆ వీసాల ద్వారా ఉద్యోగులను నియమించుకొన్న పలు ఐ‌టి కంపెనీల మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతోంది. కనుక అవి తమ మనుగడ కోసం న్యాయపోరాటానికి సిద్దం అవడంతో యుఎస్.సిఐఎస్ కాస్త వెనక్కు తగ్గింది. న్యాయస్థానంలో మొట్టికాయలు పడే అవకాశం ఉందని గ్రహించినప్పుడు వెనక్కు తగ్గడం, ఆ తరువాత మళ్ళీ యధాప్రకారం హెచ్-1బీ వీసాల జారీకి కొత్త నిబందనలు,ఆంక్షలు విధించడం యుఎస్.సిఐఎస్ కు పరిపాటిగా మారిపోయింది. కనుక షరా మామూలుగా మళ్ళీ మూడు కొత్త నిబందనలు అమలుచేయడానికి సిద్దమైంది. 

కనుక ‘ఐ‌టి సర్వ్ అలయెన్స్’ గా ఏర్పడిన ఐ‌టి కంపెనీలన్నీ కూడా మళ్ళీ యుఎస్.సిఐఎస్ పై న్యాయపోరాటం మొదలుపెట్టి వాషింగ్టన్ డిసిలోని డిస్ట్రిక్ట్ కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశాయి. అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం సుమారు 11.30 గంటలకు కోర్టులో ఈ కేసులపై విచారణ జరిగింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన న్యాయస్థానం ఐ‌టి సర్వ్ అలయెన్స్ లోని సభ్య కంపెనీల అభ్యర్ధన మేరకు ఈ కేసులన్నిటినీ ఒకటిగా చేసి “ఐ‌టి సర్వ్ అలయెన్స్-వెర్సస్-సిఐఎస్ఎస్ఎన్ఏ, డిడిసి18-సివి-2350” అనే ప్రత్యేకకేసుగా పరిగణించడానికి అంగీకరించింది. 

ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి యుఎస్.సిఐఎస్ ను ఉద్దేశ్యించి కొన్ని ఘాటు ప్రశ్నలు వేశారు.

హెచ్-1బీ వీసా దరఖాస్తుల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి నెల రోజులకుపైగా ఎందుకు సమయం  తీసుకొంటున్నారు?

2018 సం.నుంచి ప్రాధమిక నిబందనలలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ, ఫలితాల(నిర్ణయాలు)లో తేడా ఎందుకు వస్తోంది? 

ఉద్యోగికి-సంస్థకు మద్య ఉన్న బందం లేదా అగ్రిమెంట్ విషయంలో అదనపు సమాచారం ఇవ్వవలసిన అవసరం ఏమిటి? ఎందుకు కోరుతున్నారు? 

హెచ్-1బీ వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్ధిష్టమైన గడువులో పూర్తిచేసే బదులు అనిశ్చిత గడువు విధానాన్ని ఎందుకు అవలంభిస్తున్నారు? అంటూ న్యాయమూర్తి యుఎస్.సిఐఎస్ న్యాయవాదిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ పిటిషన్లపై న్యాయస్థానం స్పందన తమకు చాలా సానుకూలంగా ఉందని తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఐ‌టి సర్వ్ అలయెన్స్ నమ్మకం వ్యక్తం చేసింది. 

Related Post