అబూదాబీలో హైదరాబాద్‌వాసి అరెస్ట్...దేనికో తెలుసా?

April 30, 2019
img

ఖాదర్ వలీ పుణ్యామాని ప్రజలలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగి కొర్రలు, ఊదలు, అరికెలు వంటి తృణధాన్యాలను తినడం మొదలుపెట్టారు. ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో చాలామంది ప్రజలు సన్నబియ్యాన్ని పక్కన పెట్టి వీటినే ఆహారంగా వండుకొని తింటున్నారిప్పుడు. కనుక విదేశాలలో ఉన్న తెలుగువారు కూడా భారత్‌ నుంచి సిరిధాన్యాలను తెప్పించుకొని తింటున్నారు. కానీ వీటి గురించి తెలియని కొన్ని గల్ఫ్ దేశాలు వీటి రవాణాను నిషేదించాయి. ఈ విషయం తెలియని కొందరు భారత్‌ వచ్చినప్పుడు తృణధాన్యాలను వెంటతీసుకువెళ్ళి అక్కడ పెద్ద సమస్యలలో చిక్కుకొంటున్నారు. ఇటీవల అటువంటి సంఘటనే ఒకటి అబూదాబీ విమానాశ్రయంలో జరిగింది. 

హైదరాబాద్‌లోని అంబర్ పేటలోని మారుతీనగర్‌కు చెందిన కె.సంతోష్ రెడ్డి అనే వ్యక్తి అబూదాబీలో ఒక కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. గతవారం ఆయన హైదరాబాద్‌ నుంచి తిరిగి వెళుతూ సుమారు 2 కేజీలు తృణ ధాన్యాలు వెంట తీసుకువెళ్లారు. నిషేదిత పదార్ధాలను తీసుకువచ్చినందుకు అబుదాబీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆయనను అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. 

ఆయన కుటుంబ సభ్యులు అక్కడి భారత్‌ ఎంబసీ అధికారులను కలిసి సంతోష్ రెడ్డి విడుదల చేయించవలసిందిగా కోరారు. సాధారణంగా ఇటువంటి కేసులలో అరెస్ట్ అయినవారికి 2-4 ఏళ్ళపాటు జైలు శిక్ష విధించబడుతుంది. ఒకవేళ భారత్‌ ఎంబసీ ప్రయత్నాలు ఫలిస్తే సంతోష్ రెడ్డి ఉద్యోగం కోల్పోయినా క్షేమంగా హైదరాబాద్‌ చేరుకోగలుగుతారు లేకుంటే జైలు శిక్ష అనుభవించక తప్పదు. 

Related Post