శ్రీలంకలో ప్రేలుళ్ళు...భారత్‌కు సెగలు!

April 27, 2019
img

సరిగ్గా ఆరురోజుల క్రితం శ్రీలంక రాజధాని కొలొంబోలో జరిగిన వరుస బాంబు ప్రేలుళ్ళు, ఆత్మహుతి దాడులలో అనేకమంది చనిపోగా 500 మందికి పైగా గాయపడ్డారు. ఆరోజు నుంచి శుక్రవారం రాత్రి వరకు వరుస బాంబు ప్రేలుళ్ళు, ఆత్మహుతి దాడులతో శ్రీలంక దద్దరిల్లిపోతోంది. 

శ్రీలంకలో ప్రేలుళ్ళు మొదలైనప్పటి నుంచి వాటికి కారకులైన ఇస్లామిక్ ఉగ్రవాదుల కోసం శ్రీలంక భద్రతాదళాలు దేశమంతటా జల్లెడపడుతున్నాయి. రాజధాని కొలొంబోకు సుమారు 370 కిమీ దూరంలో ఉన్న కల్ మున్నాయ్ అనే పట్టణంలో ఒక ఇంట్లో కొందరు ఉగ్రవాదులు దాగి ఉన్నారనే తెలుసుకొన్న భద్రతాదళాలు శుక్రవారం రాత్రి ఆ భవనాన్ని చుట్టుముట్టి వారిని పట్టుకొనేందుకు ప్రయత్నించగా, లోపల నక్కిన ఉగ్రవాదులు ఎదురుకాల్పులు మొదలుపెట్టారు. సుమారు గంటసేపు హోరాహోరీగా ఇరువర్గాల మద్య కాల్పులు జరిగిన తరువాత ఉగ్రవాదులు తమను తాము శక్తివంతమైన బాంబులతో పేల్చేసుకొన్నారు. ఈ ప్రేలుళ్ళలో భవనంలో ఉన్న ఆరుగురు పిల్లలతో సహా ముగ్గురు ఉగ్రవాదులు, ముగ్గురు మహిళలు చనిపోయారు. మరో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాదళాల కాల్పులలో మృతి చెందారు. 

ఎల్టీటీఈ వేర్పాటువాదుల కారణంగా శ్రీలంకలో దశాబ్ధాలపాటు యుద్ధవాతావరణం నెలకొని ఉండేది. దానిని మట్టుబెట్టిన తరువాత లంకలో అంతా ప్రశాంతంగా ఉందనుకొంటున్న సమయంలో స్థానిక ఇస్లామిక్ ఉగ్రవాదులే ఐసిస్ ఉగ్రవాదసంస్థలో శిక్షణ పొంది మళ్ళీ లంకలో చిచ్చు రగిల్చారు. 

లంకలో రగిలిన ఈ రావణకాష్టం ఎప్పటికీ చల్లారుతుందో ఎవరికీ తెలియదు కానీ ఆ సెగలు అప్పుడే దక్షిణభారతదేశాన్ని కూడా తాకుతున్నాయి. దక్షిణభారతదేశంలో ప్రధాన నగరాలు పట్టణాలలో, ముఖ్యంగా ప్రముఖ ఆలయాలు, రైళ్ళు, బస్సులలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కనుక ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది. 

Related Post