హెచ్-1బి వీసాలు...బంగారు బాతులే!

April 10, 2019
img

మన దేశంలో అనేక రాష్ట్రప్రభుత్వాలకు మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంమే ప్రధానమైన ఆదాయవనరుగా నిలుస్తోంది. అగ్రదేశమైన అమెరికాకు అటువంటి దుస్థితి లేదు కానీ అది తీవ్రంగా వ్యతిరేకత కనబరుస్తున్న హెచ్-1బి వీసాల జారీ ద్వారానే ఏడాదికి కనీసం 5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోందని ‘నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ’ అనే సంస్థ తెలియజేసింది. తాజాగా ఒక్కో వీసాపై ‘యాంటీ ఫ్రాడ్ ఫీజ్’ పేరిట మరో 150 అమెరికన్ డాలర్లు వసూలు చేయబోతోంది. దానిని కూడా కలుపుకొంటే అమెరికా ప్రభుత్వానికి ఏడాదికి మరో 2 బిలియన్ డాలర్ల వరకు ఆదాయం పెరుగుతుందని ఆ సంస్థ తెలియజేసింది.  

 

ఒక హెచ్-1బి వీసా దరఖాస్తుపై అమెరికా ప్రభుత్వం వసూలు చేస్తున్న ఛార్జీలు (డాలర్లలో)

 

దరఖాస్తు ఫీజు

 

460

 

అటార్నీ ఫీజు

 

1,500-4,000

 

సాక్ష్యం అవసరమైనప్పుడు అటార్నీ ఫీజు

 

2,000-4,500

 

స్కాలర్ షిప్ అండ్ ట్రైనింగ్ ఫీజు

1,500 (25 లేదా అంతకంటే తక్కువ మంది ఉద్యోగులు కలిగిన సంస్థలకు 750 డాలర్లు)

 

యాంటీ ఫ్రాడ్ ఫీజు

 

500

 

ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు

 

1,410

 

హెచ్-1బి లేదా ఎల్-1 వీసాలతో వచ్చిన ఉద్యోగులు ఎక్కువమందిని కలిగిన సంస్థలు చెల్లించవలసిన 50/50 ఫీజు

 

4,000

 

వీసా దరఖాస్తు ఫీజు (మార్పుల కోసం)

 

190

 

మొదటిసారి హెచ్-1బి వీసా దరఖాస్తు కోసం

 

3,400 నుంచి 16,560 డాలర్లు

మొదటిసారి దరఖాస్తు+ వీసా గడువు పొడిగింపుకు కలిపి    

6,300 నుంచి 28,620 డాలర్లు


అమెరికన్లకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ట్రంప్ సర్కార్ హెచ్-1బి వీసాల జారీపై తీవ్ర ఆంక్షలు విధించి, వీసా ఫీజులు కూడా భారీగా పెంచింది. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే ట్రంప్ ఆలోచనను ఎవరూ తప్పుపట్టడం లేదు కానీ అందుకోసం హెచ్-1బి వీసాలపై ఇంత కటినమైన ఆంక్షలు విధించడం, ఆ వీసాలతో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారి పట్ల చులకనభావం ప్రదర్శించడాన్నే అందరూ తప్పు పడుతున్నారు. 

అమెరికాలోని సంస్థలు కూడా ఆ వీసాలను స్పాన్సర్ చేయడం కోసం భారీగా ఫీజులు చెల్లిస్తున్నాయి. ఈవిధంగా అటు అమెరికాలోని కంపెనీలు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకొన్నవారు ఏడాదికి సుమారు 7 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7,000 కోట్లు) చెల్లిస్తున్నారు. అదేమీ చిన్న మొత్తం కాదు. పైగా ఇది ప్రతీ ఏడాది ఇంకా పెరుగుతూనే ఉంటోంది తప్ప తగ్గే ప్రసక్తే లేదు. ఆయాచితంగా వచ్చిపడుతున్న ఈ భారీ మొత్తాన్ని అమెరికన్ విద్యార్ధులకు స్టైఫండ్స్ చెల్లింపులకు, అమెరికన్ యువతకు వివిద రకాల శిక్షణా తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం వినియోగిస్తోంది. 

ఇక హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చి ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులలో భారతీయులు అమెరికన్ లేదా యూరోపియన్ ఉద్యోగులతో పోలిస్తే చాలా తక్కువ జీతాలకు వారికంటే రెట్టింపు పని చేస్తుంటారు. అంటే తక్కువ ఖర్చుతోనే అమెరికాకు ఎక్కువ ప్రతిఫలం లభిస్తోందన్నమాట. ఇక వారు అమెరికాలో ఉన్నంతకాలం ఎలాగూ ప్రభుత్వానికి రకరకాల పన్నులు చెల్లిస్తూనే ఉంటారు. అంటే హెచ్-1బి వీసాలు...వాటి ద్వారా అమెరికాకు వస్తున్న ఉద్యోగులు అమెరికాకు బంగారు గుడ్లు పెట్టే బంగారుబాతుల వంటివారేనని చెప్పవచ్చు. అయినప్పటికీ, హెచ్-1బి వీసాల మంజూరు విషయంలో అమెరికా ప్రభుత్వం అహంభావపూరిత వైఖరిని ప్రదర్శిస్తూ విమర్శలు మూటగట్టుకొంటోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరుకొంటున్నట్లుగా ఒకవేళ అమెరికాలోని విదేశీ ఉద్యోగులు అందరూ తమతమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోతే అమెరికాలో సంస్థలన్నీ యధాతధంగా పనిచేయగలవా? అమెరికా ఆర్ధిక పరిస్థితి యధాతధంగా ఉంటుందా? అని ఆలోచిస్తే కాదనే అర్ధమవుతుంది. అంటే అమెరికా అభివృద్ధిలో... దాని ఆర్ధిక అభివృద్ధిలో విదేశీయులు ముఖ్యంగా భారతీయులు ఎంత కీలకపాత్ర పోషిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. కనుక హెచ్-1బి వీసాల జారీలో అమెరికా ప్రభుత్వం కాస్త సానుకూలంగా వ్యవహరిస్తూ, ఆ వీసాలపై వచ్చిన వారికి సముచిత గౌరవం ఇస్తే అందరూ సంతోషిస్తారు.

Related Post