ఆస్ట్రేలియాలో తెలంగాణ వైద్యురాలి హత్య

March 07, 2019
img

 ఇటీవల రాష్ట్రంలో ప్రేమోన్మాదుల చేతుల్లో యువతులు బలవుతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాము. విదేశాలలో కూడా యువతులకు ఈ బాధలు తప్పడం లేదు. 

ఆస్ట్రేలియాలో ఉంటున్న తెలంగాణ వైద్యురాలు దారుణహత్యకు గురైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలోని గురుకుంట గ్రామానికి చెందిన ప్రీతీరెడ్డి(32) ఆస్ట్రేలియాలో దంతవైద్యురాలు. ఆమె తండ్రి నర్సింహారెడ్డి కూడా వైద్యుడే. వారి కుటుంబం 23 సం.ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చి అక్కడే స్థిరపడింది. ప్రీతీరెడ్డి సిడ్నీ సమీపంలోని బ్లూ మౌంటెన్స్ వద్ద గ్రేన్ బ్రూక్ ఆసుపత్రిలో డెంటల్ సర్జన్ గా పనిచేస్తున్నారు. 

ఈనెల 2వ తేదీన ఆమె సెయింట్ లియోనార్డ్ లో జరుగుతున్న ఒక వైద్యసదస్సులో హాజరయ్యేందుకు వెళ్లారు. సమావేశం పూర్తికాగానే ఇంటికి వస్తానని చెప్పిన ఆమె ఎంతకీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె తల్లితండ్రులు పోలీసులకు పిర్యాదు చేషారు. 

పోలీసులు దర్యాప్తు చేసి కింగ్స్ ఫోర్డ్ అనే ప్రాంతంలో పార్క్ చేయబడిన ఆమె వాహనాన్ని కనుగొన్నారు. దానిలో ఆమె శవం ఉంది. దర్యాప్తులో తేలిందేమిటంటే ఆమె మాజీ ప్రియుడు, భారతసంతతికి చెందిన దంతవైద్యుడు హర్షవర్ధన్‌ నార్డే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. ఆమెను అతికిరాతకంగా కత్తితో పొడిచి చంపి, రక్తం కారుతున్న ఆమె శవాన్ని ఓ సూట్ కేసులో కుక్కి దానిని అక్కడే ఉన్న ఆమె కారులో పెట్టేసి పారిపోయాడు. కానీ ఆమెను హత్య చేసినరోజే అతను కూడా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 

గతంలో ప్రీతి, హర్షవర్ధన్‌ ప్రేమించుకొని కొంతకాలం కలిసి తిరిగారు. కానీ వారి మద్య అభిప్రాయభేధాలు రావడంతో ప్రీతి అతని నుంచి దూరంగా ఉంటోంది. కానీ అతను ప్రీతి వెంటపడుతుండేవాడు. ఈ సందర్భంగా ఆమె పలుమార్లు అతనిని హెచ్చరించినట్లు సమాచారం. మార్చి 2న కూడా మళ్ళీ అదే జరిగింది. తన వెంటపడి వేధిస్తున్న అతనిని హెచ్చరించడానికి వెళ్లినప్పుడు అతను ఆవేశంతో కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు. ఆ తరువాత తీవ్ర భయాందోళనలతో ఉన్న అతను కారులో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రక్కును గుద్దుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

Related Post