అదే అమెరికాపై దాడి జరిగితే...

February 20, 2019
img

కాల్లో ముల్లు గుచ్చుకొన్నవాడికే ఆ బాధేమిటో తెలుస్తుంది చూసేవాడికి తెలియదన్నట్లున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటలు. పుల్వామా ఉగ్రదాడిపై స్పందిస్తూ, “దాని గురించి నాకు చాలా సమాచారం వచ్చింది. అదొక భయానక చర్య. అక్కడి పరిస్థితులు కూడా భయానకంగా ఉన్నాయి. సరైన సమయంలో దీనిపై తగినవిధంగా స్పందిస్తాము. ఉగ్రవాదనిర్మూలనకు గట్టి చర్యలు తీసుకోవాలని మేము పాకిస్థాన్‌ను కోరాము. భారత్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాము. భారత్, పాక్ రెండుదేశాలు కలిసి నడిస్తే బాగుంటుంది,” అని అన్నారు. 

భారత్‌పై ఇప్పటికే పలుమార్లు పాక్ ప్రేరిత ఉగ్రవాదదాడులు జరిగాయి బహుశః ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయి. వాటిలో ఇలాగే జవాన్లు, ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటారు. అయినా భారత్‌-పాక్ లు కలిసి నడవాలని ట్రంప్ ఉచిత సలహా ఇస్తున్నారు. ఇదే దాడి అమెరికాలో జరిగి ఉండి ఉంటే ట్రంప్ ఈవిధంగా మాట్లాడేవారా? వెంటనే ఆ దేశం మీదకు యుద్ధవిమానాలను పంపి బాంబుల వర్షం కురిపించి ఉండేవారు కదా? మెక్సికో నుంచి అక్రమవలసదారులు వస్తేనే సహించలేక సరిహద్దు పొడవునా గోడ కట్టాలని పట్టుబడుతున్న ట్రంప్, భారత్‌పై పాకిస్థాన్‌ ఉగ్రవాదులు దాడులు చేసి సైనికుల, ప్రజల ప్రాణాలు బలిగొంటుంటే భారత్ సంయమనం పాటించాలని శాంతి సూక్తులు వల్లించడం హాస్యాస్పదంగా ఉంది. 

భారత్ ఇప్పటికిప్పుడు పాకిస్థాన్‌తో ప్రత్యక్ష యుద్ధానికి వెళ్ళే పరిస్థితి లేదన్న మాట వాస్తవం. కానీ నిరంతరంగా పాక్ ఉగ్రవాదులు దాడులు చేస్తూ దేశంలో అరాచకం సృష్టిస్తుంటే చనిపోయినవారిని లెక్కపెడుతూ భారత్ చేతులు ముడుచుకొని కూర్చోవడం కూడా సరికాదు. కనుక ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లు ఇక పాకిస్థాన్‌కు చేతలతోనే బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కానీ దాని వలన భారత్‌కు ఎటువంటి నష్టం జరుగకుండా చూడటమే చాలా ముఖ్యం. కనుక అది ఏవిధంగా అనేదే నిర్ణయం కావలసి ఉంది.

Related Post