తానా కృషి అపూర్వం

February 09, 2019
img

అమెరికాలోని ఫార్మింగ్టన్‌ నకిలీ యూనివర్సిటీ కేసులో 129 మంది భారతీయ విద్యార్ధులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీష్ వేమన బృందం కృషి వలన వారిలో 40 మంది విద్యార్ధులు బెయిల్‌పై విడుదలయ్యారు. మరో 89 మంది ఇంకా విడుదల కావలసి ఉంది. వారిని కూడా త్వరలోనే విడిపిస్తామని తానా బృందం తెలిపింది. అంతే కాకుండా వారందరూ విద్యాసంవత్సరం కోల్పోకుండా వేరే యూనివర్సిటీలలో ప్రవేశం కల్పించడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. 

ఇకపై ఉన్నత చదువుల కోసం అమెరికావచ్చే విద్యార్ధులు ఇటువంటి సమస్యలలో ఇరుక్కోకుండా ఉండేందుకు, అమెరికాలోని యూనివర్సిటీలకు సంబందించి పూర్తి వివరాలతో కూడిన ‘అడ్వైజరీ’ని విడుదల చేస్తామని తెలిపింది. తద్వారా అమెరికా రావాలనుకొంటున్న విద్యార్ధులకు వారి తల్లితండ్రులకు అమెరికాలోని యూనివర్సిటీలు, అవి అందిస్తున్న కోర్సులు, వాటి ఫీజులు, వాటిలో చేరేందుకు అవసరమైన దృవపత్రాలు మొదలైన ప్రతీ అంశం గురించి ముందుగానే అవగాహన ఏర్పడుతుందని తానా బృందం తెలిపింది. ఈ అడ్వైజరీని రూపొందించి దానిని విద్యార్ధులు, వారి తల్లితండ్రులకు చేర్చేందుకు భారత్ విదేశాంగశాఖ అధికారులతో చర్చిస్తామని తానా బృంద సభ్యులు తెలిపారు. 

ఫార్మింగ్టన్‌ యూనివర్సిటీ కేసులో తానా అధ్యక్షుడు సతీష్ వేమన బృందం అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ శృంగ్లా, 17 మంది అమెరికా కాంగ్రెస్‌ సభ్యులను కలిసి భారతీయ విద్యార్ధులను విడిపించేందుకు సహకరించవలసిందిగా అభ్యర్ధించారు. త్వరలోనే మిగిలిన విద్యార్ధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తానా బృందం తెలిపింది. దేశం కానీ దేశం అమెరికాలో జైలు పాలైన భారతీయ విద్యార్ధులను విడిపించేందుకు (తానా) చేస్తున్న కృషి అపూర్వం. అభినందనీయం.

Related Post