అమెరికాకు రావచ్చు కానీ... ట్రంప్ షరతులు

February 07, 2019
img

ప్రపంచంలో అనేక దేశాల నుంచి వలసలు వచ్చినవారి శ్రమ, తెలివితేటలు, నైపుణ్యంతోనే అమెరికా నేడు అగ్రరాజ్యంగా ఎదిగిందనే సంగతి అందరికీ తెలుసు. కనుక అమెరికా వలసవిధానం ఎప్పుడూ సరళంగానే ఉండేది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మితిమీరిన వలసల వలన అమెరికన్లకు తీరని నష్టం జరుగుతోందని భావించి, హెచ్1-బి వీసాల జారీ విధానాన్ని కఠినతరం చేశారు. వివిద దేశాల నుంచి అమెరికాకు వస్తున్న వారిని అడ్డుకొంటూనే మరోపక్క ఇప్పటికే అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నవారిని ఏరివేసి స్వదేశాలకు పంపించివేసేందుకు ట్రంప్ సర్కార్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. అలాగే అమెరికాలో స్థిరపడాలనుకునేవారిని కూడా నియంత్రించేందుకు పలు ఆంక్షలు విధిస్తోంది. ఈ చర్యలను విదేశీయులు జీర్ణించుకోవడం కష్టమే కానీ అమెరికా ప్రయోజనాల కోసం అవసరమేనని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా వాదిస్తున్నారు. 

బుదవారం అమెరికన్ కాంగ్రెస్‌ (పార్లమెంటు)ను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అమెరికా పౌరులకు ఉద్యోగాలు కల్పించడం, వారి భవిష్యత్ కు భద్రత కల్పించడం, దేశప్రయోజనాలను కాపాడటం తదనుగుణంగా వలస విధానాలను రూపొందించడం మా బాధ్యత. వలసవచ్చిన ప్రతిభావంతులైన విదేశీయులు దేశాభివృద్ధికి చాలా దోహదపడుతున్నమాట వాస్తవం. ప్రతిభావంతులకు అమెరికా ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది. కానీ అమెరికా రాదలచినవారు చట్టపరంగా మాత్రమే రావాలని కోరుతున్నాను. అలాగే మెక్సికో నుంచి అక్రమ వలసలకు అడ్డుకట్టవేయడానికి సరిహద్దు గోడను తప్పకుండా నిర్మిస్తాము. ఇది దేశ భద్రత, భవిష్యత్ కు సంబందించిన విషయం కనుక ప్రతిపక్ష సభ్యులు కూడా ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

Related Post