చిగురుపాటి హత్య కేసు తెలంగాణ పోలీస్ శాఖకు బదిలీ

February 06, 2019
img

రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తున్న ప్రవాసాంద్రుడైన కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎక్స్‌ప్రెస్ టివి ఎండి చిగురుపాటి జయరాం హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. ఆయన హత్యకు ప్రధాన కారణం ఆర్ధికలావాదేవీలేనని ఏపీ పోలీసుల దర్యాప్తులో రుజువైంది. 

జయరాంకు రూ.6 కోట్లు అప్పు ఇచ్చిన రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి ఆ డబ్బును తిరిగి పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా జయరాం ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతుండటంతో, ఆయన వద్ద నుంచి బలవంతంగానైనా డబ్బు రాబట్టుకోవాలనే ఆలోచనతో ఒక అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి హైదరాబాద్‌లో ఒక ఇంటికి రప్పించాడు. కానీ జయరాం అంతా డబ్బు ఒకేసారి ఇవ్వలేకపోవడంతో ఆగ్రహం పట్టలేక జయరాం మొహంపై, ఛాతిపై  పిడిగుద్దులు గుద్ది, ఆ తరువాత దిండుతో మొహంపై నొక్కిపెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు. 

హత్య చేసిన తరువాత ఆ కేసులో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన సిఐ శ్రీనివాస్, ఎసిపి మల్లారెడ్డిలకు ఫోన్ చేసి వారి సలహా మేరకు జయరాం శవాన్ని కారులో పెట్టుకొని కృష్ణాజిల్లాలోని నందిగామ వద్ద విడిచిపెట్టి కారు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 

కానీ ఏపీ పోలీసుల దర్యాప్తులో అది హత్య అని తేలడంతో వారు ఆకోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో సిఐ శ్రీనివాస్, ఎసిపి మల్లారెడ్డిల పేర్లు బయటకు వచ్చాయి. పోలీస్ అధికారులై ఉండి వారిరువురూ ఒక హంతకుడికి సహాయపడినందుకు తెలంగాణ డిజిపి వారిరువురినీ విధులలో నుంచి తప్పించారు. 

జయరాం భార్య పద్మశ్రీ మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, జయరాం హత్య హైదరాబాద్‌లో జరిగి ఉండటంతో ఈ కేసును తెలంగాణ పోలీస్ శాఖకు బదిలీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ డిజిపి ఆర్.పి. ఠాకూర్ ప్రకటించారు. న్యాయనిపుణులను సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని డిజిపి ఆర్.పి.ఠాకూర్ తెలిపారు.

Related Post