ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వితరణ

January 23, 2019
img

అమెరికాలో స్థిరపడిన తెలుగువారు(ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్) రాష్ట్రంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారని అందరికీ తెలుసు. తమ ఉన్నతికి కారణమైన అమెరికాకు ఏ కష్టమొచ్చినా కూడా సహాయసహకారాలు అందించడంలో వారు ఎప్పుడూ ముందుంటారు. 

అమెరికాలో అధికార, ప్రధానప్రతిపక్ష పార్టీల మద్య ద్రవ్య వినిమయబిల్లుపై ప్రతిష్టంభన ఏర్పడటంతో ప్రభుత్వ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదల కాలేదు. దాంతో గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా వేలాది ప్రభుత్వకార్యాలయాలు (షట్ డౌన్) మూతపడ్డాయి...లక్షలాది ప్రభుత్వోద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినప్పటికీ కొన్ని అత్యవసరసేవలందిస్తున్నవారు మాత్రం పనిచేస్తునే ఉన్నారు. వారిలో విమానాశ్రయాలలో పనిచేసే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. విమానాలలోకి తీసుకువెళ్ళే వస్తువులను తనికీలు చేసే సెక్యూరిటీ సిబ్బంది (టీఎస్ఏ) ‘షట్ డౌన్’ కారణంగా నానాఅవస్థలు పడుతున్నారు. 

ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో పనిచేస్తున్న టీఎస్ఏ సిబ్బంది సమస్యలను గుర్తించిన ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ కొన్ని గంటల వ్యవధిలోనే 1,570 అమెరికన్ డాలర్లు విరాళాలు సేకరించింది. వాటిలో సుమారు 700 డాలర్లతో వారందరికీ మంగళవారం మధ్యాహ్న భోజనానికి అవసరమైన పిజ్జాలు, శాండ్ విచ్, బర్గర్లు, నూడుల్స్, నీళ్ళ బాటిల్స్, సోడాలు మొదలైన ఆహారపదార్ధాలను అందజేసింది. విమానాశ్రయ టీఎస్ఏ సిబ్బంది అభ్యర్ధన మేరకు  మిగిలిన సొమ్ముతో నిలువ ఉండే ఆహారపదార్ధాలను కొనుగోలు చేసి అందజేసింది. ఈ సందర్భంగా టీఎస్ఏ సిబ్బంది ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.   


Related Post