డొనాల్డ్ ట్రంప్ సర్కారు పాలనకు రెండేళ్ళు పూర్తి

January 22, 2019
img

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు రెండేళ్ళు పూర్తయింది. ఆయన 2017, జనవరి 20 వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ రెండేళ్ళలో ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ప్రభావం అమెరికాపై మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంపై కూడా పడింది. 

డొనాల్డ్ ట్రంప్ గత రెండేళ్ళలో 50 లక్షల ఉద్యోగాలు సృష్టించారని, వాటిలో అత్యధికశాతం అమెరికన్లకు లభించాయని వైట్ హౌస్ పేర్కొంది. ముఖ్యంగా..గతంలో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లకు మళ్ళీ ఉద్యోగాలు లభించాయని పేర్కొంది. అమెరికా పరిశ్రమలకు, కార్మికులకు మేలు కలిగించేవిధంగా డొనాల్డ్ ట్రంప్ సంస్కరణలు చేపట్టారని, తదనుగుణంగా విదేశాలతో ఒప్పందాలు చేసుకున్నారని పేర్కొంది. వాణిజ్యం, విదేశీ వలసల విధానంలో అమలుచేసిన పలు సంస్కరణల వలన దేశానికి ఎంతో మేలు కలిగిందని వైట్ హౌస్ పేర్కొంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా వాస్తవిక స్థూల జాతీయ ఉత్పత్తి 3.4 శాతానికి పెరిగిందని పేర్కొంది. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టి శాంతి నెలకొల్పినందున అమెరికా సేనలను వెనక్కు పిలిపిస్తున్నామని వైట్ హౌస్ పేర్కొంది. 

ట్రంప్ నిర్ణయాల వలన అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరిగిన మాట వాస్తవమే కానీ పారిశ్రామిక అభివృద్ధి మందగించిందనే వాదన కూడా వినిపిస్తోంది. అదేవిధంగా ట్రంప్ వైఖరివలన ప్రపంచదేశాలలో దృష్టిలో అమెరికా మరింత నిరంకుశ దేశంగా, ఒంటరిగా మారుతోందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ విదేశీవిధానాల వలన అమెరికా చాలా అపఖ్యాతి మూటగట్టుకొంటోందని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడబోతున్న డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్(కాలిఫోర్నియా రాష్ట్ర మాజీ అటార్నీ జనరల్‌) వాదిస్తున్నారు. 

ట్రంప్ నిర్ణయాల వలన ప్రపంచ దేశాలకు నష్టం జరిగిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే అమెరికాకు, నిరుద్యోగ అమెరికన్లకు, సగటు అమెరికన్ పౌరులకు మేలు జరిగిందా లేదా అనేదే ముఖ్యం. కనుక ట్రంప్ రెండేళ్ళ పాలన ఏవిధంగా ఉందో అమెరికన్ పౌరులే చెప్పాల్సి ఉంటుంది. 

Related Post