ఇరాక్‌లో చిక్కుకొన్న తెలంగాణవాసులు

January 16, 2019
img

నిజామాబాద్‌ జిల్లా ఇందూరుకు చెందిన 15మంది యువకులు గత నాలుగున్నర నెలలుగా ఇరాక్‌లో చిక్కుకొని నరకయాతన అనుభవిస్తున్నారు. ఇరాక్‌లో వేలరూపాయలు జీతం వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక గల్ఫ్ ఏజంటు వారు ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.1.5-2 లక్షలు వసూలు చేసి వారిని విజిటింగ్ వీసా మీద ఇరాక్ పంపించి చేతులు దులుపుకున్నాడు. ఇరాక్‌లో దిగిన తరువాత వారిని పట్టించుకునే నాధుడు లేకపోవడంతో ఆ యువకులు ఏమి చేయాలో తెలియక ఒక చిన్న గదిలో తలదాచుకున్నారు. కానీ విజిటింగ్ వీసా గడువు కూడా ముగిసిపోవడంతో బయటకు వస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో గత నాలుగున్నర నెలలుగా ఆ గదిలోనే అందరూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో డబ్బు లేకపోవడంతో వెనక్కు తిరిగి రాలేక ఆకలితో అలమటిస్తున్నారు. 

తమను వీలైనంత త్వరగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రప్పించేందుకు సహాయపడాలని కోరుతూ మొబైల్ ఫోన్ ద్వారా తమ కుటుంబ సభ్యులకు ఒక సందేశం పంపారు. ఆ సందేశంలో తమను కాపాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మొరపెట్టుకున్నారు. వారి దుస్థితి చూసి వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరాక్‌లో చిక్కుకొన్న తమవారిని కాపాడాలని వారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వేడుకొంటున్నారు.

Related Post