ట్రంప్ మాటల గారడీ చేస్తున్నారా లేక...

January 12, 2019
img

డొనాల్డ్ ట్రంప్ ‘విదేశీయులు అవుట్-అమెరికా ఫస్ట్’ అనే వ్యూహంతో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తదనుగుణంగా మొదటి రెండు సంవత్సరాలలో హెచ్1-బి వీసాల మంజూరులో అనేక ఆంక్షలు విధించారు. అలాగే గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొన్నవారికీ చుక్కలు చూపించారు. వాటి కారణంగా ఉద్యోగాల కోసం అమెరికా రావాలనుకొంటున్న వారు, ఇప్పటికే అమెరికాలో హెచ్1-బి వీసాల పని చేస్తున్నవారు తీవ్ర అయోమయం, ఆందోళనతో ఉన్నారు. అమెరికాలో ఇతర దేశస్థులు ఎవరూ ఉండవద్దన్నట్లు వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కార్ వైఖరి విసుగెత్తిపోయిన చాలా మంది అమెరికా ఉద్యోగాలపై ఆశలు వదులుకొని వేరే దేశాలవైపు వెళుతున్నారు కూడా. 

కానీ ట్రంప్‌కు హటాత్తుగా ఏమయిందో ఏమో గానీ హెచ్1-బి వీసాల నిబందనలు, వాటి జారీలో త్వరలోనే భారీ మార్పులు చూడబోతున్నారని ప్రకటించారు. హెచ్1-బి వీసాల ద్వారా గ్రీన్ కార్డులు పొందేందుకు వీలుగా నిబందనలలో మార్పులు చేయబోతున్నట్లు చెప్పారు.  ప్రతిభ ఆధార వలస విధానం (మెరిట్‌-బేస్డ్‌ ఇమిగ్రేషన్‌ సిస్టం)ను అమలుచేయబోతున్నట్లు చెప్పారు. తద్వారా ‘అత్యధిక వేతనాలతో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులు’ అమెరికాలో స్థిరపడేందుకు వీలు కల్పిస్తామని ట్రంప్ చెప్పారు. అలాగే హెచ్1-బి వీసాలతో పనిచేస్తున్నవారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిశ్చింతగా అమెరికాలో ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కల్పిస్తూ నిబందనలలో మార్పులు చేస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. 

కానీ దేశంలో అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే హెచ్1-బి వీసాలపై కటినమైన ఆంక్షలు విధించివాటిని ఖచ్చితంగా అమలుకూడా చేస్తునప్పుడు హటాత్తుగా ట్రంప్ ఈవిధంగా చెప్పడం నమ్మశక్యంగా లేదు. హెచ్1-బి వీసాల విషయంలో తన విధానంవలన అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించినందునే ట్రంప్ ఈవిధంగా మాట్లాడుతున్నారా? లేక ‘అత్యధిక వేతనాలతో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులకు అవకాశాలు కల్పిస్తామని ఇదివరకు చెప్పినదే మళ్ళీ చెపుతూ మాటల గారడీ చేసి ఇంకా కటినతరమైన ఆంక్షలు విధించబోతున్నారా? అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.

Related Post