గీతం యూనివర్సిటీ అధినేత ఎంవీవీఎస్‌ మూర్తి మృతి

October 03, 2018
img

గీతం యూనివర్సిటీ అధినేత, టిడిపి ఎమ్మెల్సీ డాక్టర్ ఎంవీవీఎస్‌ మూర్తి అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరొక నలుగురితో కలిసి కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు వారి వాహనాన్ని డ్డీకొనడంతో ఎంవీవీఎస్‌ మూర్తితో బాటు వాహనంలో ప్రయాణిస్తున్న వి. బసవపున్నయ్య, వి. శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న కె. వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం సంగతి తెలుసుకొన్న తానా సభ్యులు హుటాహుటిన అలాస్కా చేరుకొని వారి మృతదేహాలను విశాఖకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంవీవీఎస్‌ మూర్తి ఎన్టీఆర్ కుటుంబంతో టిడిపితో మంచి అనుబందం కలిగిఉన్నారు. 

ఎంవీవీఎస్‌ మూర్తి పూర్తిపేరు డాక్టర్ మతుకుమిల్లి  వీర వెంకట సత్యనారాయణ మూర్తి. తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో మూలపొలం అనే గ్రామంలో జన్మించారు. 

ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో అత్యంత ప్రజాధారణ పొందిన కూల్ డ్రింక్ ‘గోల్డ్ స్పాట్’. దానిని తయారు చేసే విశాఖ బాట్లింగ్ కంపెనీని ఆయనే 1967లో విశాఖలో ఏర్పాటు చేశారు. దాంతో ఆయనకు ‘గోల్డ్ స్పాట్ మూర్తి’గా పేరు వచ్చింది. ఎం.ఏ,బిఎల్,పిహెచ్.డి చేసిన ఉన్నత విద్యావంతులైన మూర్తిగారు అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. వాటిలో విశాఖలో ఏర్పాటు చేసిన గీతం యూనివర్సిటీ కూడా ప్రముఖమైనది. 

ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా పేరుతెచ్చుకొన్న డాక్టర్ ఎంవీవీఎస్‌ మూర్తి స్వర్గీయ ఎన్టీఆర్ తో కలిసి రాజకీయాలలోకి కూడా ప్రవేశించారు. ఆయన కూడా టిడిపి వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1987-89 సం.లలో ఆయన ఉడా (విశాఖ అర్బన్ డెవలప్మెంట్ ఆధారిటీ)కి ఛైర్మన్ గా ఉన్నప్పుడు విశాఖనగరంలో వుడా పార్క్, కైలాసగిరి వంటివి నిర్మింపజేసి విశాఖ నగరం దేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఎదిగేందుకు దోహదపడ్డారు. ఆయన 1991,1999లో రెండుసార్లు విశాఖపట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా పనిచేసి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు అందుకొన్నారు. ఆయన మరణవార్త విని రాజకీయ, విద్యా, పారిశ్రామిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Related Post