గ్రీన్ కార్డులకు రెడ్ సిగ్నల్!

September 24, 2018
img

‘అమెరికన్స్ ఫస్ట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఎన్ని అవరోధాలు, ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా తన లక్ష్యం వైపు ముందుకు సాగిపోతున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే గ్రీన్ కార్డుల జారీపై సరికొత్త ఆంక్షలు విధించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. దానికి సంబందించి ఒక ముసాయిదాను హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెప్టెంబరు 21న తన అధికారిక వెబ్ సైటులో పెట్టింది. 

దాని ప్రకారం అమెరికా ప్రభుత్వం అందిస్తున్న విద్యా, వైద్య, ఆహార, గృహ తదితర సంక్షేమ పధకాలలో లబ్ది పొందుతున్నవారు ఇకపై గ్రీన్ కార్డుకు అనర్హులుగా పరిగణించబడతారు. కనుక ఇకపై గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోబోయేవారు తాము ప్రభుత్వ పధకాల వలన ఎటువంటి లబ్ధి పొందలేదని దృవీకరణ పత్రం కూడా సమర్పించవలసి ఉంటుంది. అలాగే అమెరికన్ల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలు ఏవీ కొత్తగా గ్రీన్ కార్డు మంజూరు అయినవారికి వర్తింపబడవు. అంతేగాక అమెరికాలో స్థిరపడాలనుకొంటున్న విదేశీయులు తమకు అంతా ఆర్ధిక స్థోమత ఉందని నిరూపించుకోవలసి ఉంటుంది. దీనిపై మూడు నెలలపాటు ప్రజాభిప్రాయ సేకరణ జరిపి ఆ నివేదిక ఆధారంగా, దీని కోసం అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు)లో ఒక బిల్లును ప్రవేశపెడతారు. దానికి కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేస్తే అమలులోకి వస్తుంది. 

హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ జారీ చేసిన ఈ ముసాయిదాపై హెచ్-1 బి వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు సంపాదించుకొని గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసుకొంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. ఈ నిబందనల వలన మున్ముందు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసివస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ తాజా నిబందనలకు అమెరికన్ కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేస్తే సుమారు 3.82 లక్షలమందిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం వారు పనిచేస్తున్న కంపెనీలపై కూడా పడుతుంది. కనుక దీనిపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని అవరోధాలు ఎదురవుతున్నా డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలను ఖచ్చితంగా అమలుచేస్తున్నారు కనుక దీనిపై కూడా వెనక్కు తగ్గకపోవచ్చు.

Related Post