ఎన్.ఆర్.ఐ.ల తపనకు ప్రతిరూపం ప్రజా మ్యానిఫెస్టో

September 19, 2018
img

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలయినందున అన్ని పార్టీల నేతలు వ్యక్తిగత స్థాయిలో పరస్పరం దూషించుకొంటూ, విమర్శలు, ఆరోపణలు చేసుకొంటుండటంతో ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇంకా తన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించనప్పటికీ ఓటర్లను ఆకట్టుకొనేందుకు ఆకర్షణీయమైన కొన్ని హామీలను ప్రకటించింది. కనుక మిగిలిన పార్టీలు కూడా దానికి ధీటుగా రేపో మాపో తమ ఎన్నికల మ్యానిఫెస్టోలను విడుదల చేస్తాయి. 

అయితే రాజకీయ నాయకుల ఈ విమర్శలు, ఆరోపణల వలన రాష్ట్ర ప్రజలకు ఏమి ప్రయోజనం? రాజకీయ పార్టీలు ప్రకటించే మ్యానిఫెస్టోలలో హామీలు నిజంగా ఆచరణ సాధ్యమేనా? వాటి ఎన్నికల మ్యానిఫెస్టోలు నిజంగా రాష్ట్రాభివృద్ధికి దోహదపడతాయా లేక ఎన్నికలలో ఓటర్లను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకోవడానికేనా?అని ప్రజలందరూ కూడా ఆలోచించవలసి ఉంది. 

ప్రస్తుతం అధికార ప్రతిపక్షాలు పూర్తి భిన్నమైన వాదనలు బలంగా వినిపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయాలలో ఒక సందిగ్ధ పరిస్థితి కనిపిస్తోంది. వీటన్నిటికీ అతీతంగా రాష్ట్రానికి ఏది మంచి? ఏది చెడు? ఏది అవసరం? ఏది అనవసరం? అని అమెరికాలో స్థిరపడిన తెలంగాణావాసులు లోతుగా అధ్యయనం చేసి ఒక ప్రజా మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నారు. 

గత నాలుగేళ్ళుగా తెలంగాణాలో అనేకానేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్న ఎన్.ఆర్.ఐ.లు, క్రమం తప్పకుండా ‘డయల్ యువర్ విలేజ్’ అనే పేరుతో ప్రతీవారం రాష్ట్రంలో మారుమూల గ్రామ ప్రజలతో, గ్రామాధికారులతో, రాష్ట్రంలో వివిద రంగాలకు చెందిన ప్రముఖులతో, మేధావులతో, అధికారులు, రిటైర్డ్ అధికారులతో ఫోన్ ద్వారా వివిద అంశాలపై లోతుగా చర్చించి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. 

‘డయల్ యువర్ విలేజ్’ లో పాల్గొనవారి ఆభిప్రాయాలను, ఆలోచనలను రాష్ట్ర ప్రజలతో కూడా పంచుకొనేందుకు వాటిని ఎప్పటికప్పుడు ఆన్-లైన్ లో ఉంచుతూ మళ్ళీ వాటిపై వివిద వర్గాల ప్రజలు, ప్రముఖుల నుంచి వచ్చిన అభిప్రాయాలను కూడా క్రోడీకరించి తెలంగాణా రాష్ట్రానికి, ప్రజలకు అత్యంత అవసరమైన అంశాలతో కూడిన పార్టీలకు అతీతమైన ప్రజా మ్యానిఫెస్టోను రూపొందించి త్వరలోనే ప్రజల ముందుంచబోతున్నారు. 

కనుక ప్రజాభిప్రాయానికి అద్దం పట్టే ఈ ప్రజా మ్యానిఫెస్టోను అన్ని పార్టీలు కూడా పరిగణలోకి తీసుకొంటే అమెరికాలో ప్రవాస తెలంగాణావాసుల కష్టానికి ఫలితం ఉంటుంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రూపొందించబడుతున్న ఈ ప్రజా మ్యానిఫెస్టోను ఒకసారి పరిశీలించి, తమ ముందుకు వస్తున్న పార్టీలలో మంచి చెడులను బేరీజు వేసుకొని సరైన పార్టీకి అధికారం అప్పగించవచ్చు.

ఆర్. రవికాంత్ రెడ్డి, ది హిందూ సౌజన్యంతో... 

Related Post