అమెరికాలో గుంటూరు యువకుడు మృతి

September 07, 2018
img

అమెరికాలో తుపాకీ సంస్కృతికి భారతీయులు కూడా బలైపోవడం చాలా విచారకరం. గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణానికి చెందిన వాసి పృధ్వీరాజ్ (26)అనే యువకుడు అమెరికాలో అన్యాయంగా బలైపోయాడు. అతను ఒహియోలోని సిన్సినాటి నగరంలో ఒక బ్యాంకులో పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం బ్యాంక్ మూసివేస్తున్న సమయంలో కొందరు దుండగులు తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించి బ్యాంకులోపల ఉన్నవారిపై కాల్పులు జరుపుతూ దోపిడీ చేశారు. వారి కాల్పులలో వాసి పృధ్వీరాజ్ తో సహా ముగ్గురు బ్యాంక్ ఉద్యోగులు చనిపోయారు. కుమారుడి మరణవార్త విని అతని తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

కొడుకు అమెరికాలో బ్యాంక్ ఉద్యోగంలో స్థిరపడినందున త్వరలోనే అతనికి వివాహం చేయాలని అతని తల్లితండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంతలోనే అతను మృత్యువు ఒడికి చేరాడు. పృధ్వీరాజ్ భౌతికకాయాన్ని భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలలుకంటూ అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయ యువత ఈవిధంగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయి శవపేటికలలో భారత్ తిరిగి వెళుతుండటం చాలా బాధాకరం. 

Related Post