ఐటి సర్వ్ అలయన్స్ కృషి ఫలించింది

August 19, 2018
img

అమెరికాలో ఉన్నతవిద్యలు ఆభ్యసిస్తున్న వేలాదిమంది విదేశీవిద్యార్ధులకు, శిక్షణ సమయంలో వారి సేవలు ఉపయోగించుకొంటున్న వేలాది సంస్థలకు ఉపశమనం లభించింది. అందుకు కారణం ఐటి సర్వ్ అలయన్స్ కృషే. 

విదేశీ విద్యార్దుల శిక్షణ విషయంలో ‘ది యుఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసస్’ (యుఎస్ఐసిఎస్)  కొన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు ఇటీవల తన అధికారిక వెబ్ సైట్ లో పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (ఎస్.టి.ఈ.ఎం.) రంగాలలో ఉన్నత విద్య పూర్తి చేసుకొన్న విదేశీ విద్యార్ధులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓ.పి.టి.) కొరకు ‘స్టెమ్ ఓపిటి’ విధానంలో అమెరికాలో ఏదైనా సంస్థలో చేరి గరిష్టంగా రెండేళ్ల పాటు శిక్షణ పొందవచ్చు. ఆ సమయంలో వారిని మాతృసంస్థలో తప్ప ఇతర సంస్థలకు పంపించి పని చేయించరాదని యుఎస్ఐసిఎస్ ఆంక్షలు విధించింది. 

ఈ కొత్త ఆంక్షల వలన అటు విదేశీవిద్యార్ధులు, వారికి నియమించుకొన్న సంస్థలు కూడా నష్టపోయే ప్రమాదం  ఉందని గ్రహించిన ఐటి సర్వ్ అలయన్స్ దానిని వ్యతిరేకిస్తూ జూలై 14, 2018న టెక్సాస్ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసింది. దాంతో యుఎస్ఐసిఎస్ తన నిర్ణయం మార్చుకోకతప్పలేదు. 

యుఎస్ఐసిఎస్ అధికారిక వెబ్ సైటులో దీనిపై వివరణ ఇస్తూ గతంలో విధించిన నిబందనలను సడలిస్తున్నట్లు పేర్కొంది. ‘విద్యార్ధికి-అతను లేదా ఆమెకు శిక్షణ ఇస్తున్న సంస్థ యాజమాన్యం నిబంధనలకు కట్టుబడి పారదర్శకంగా వ్యవహరిస్తున్నంత కాలం ‘స్టెమ్ ఓపిటి’ విధానంలో యధాప్రకారం శిక్షణ కొనసాగించవచ్చు. అయితే సదరు విద్యార్ధి, సదరు సంస్థ ప్రభుత్వ గుర్తింపు కలిగి ఉండాలి,’ అని పేర్కొంది. 


ఈ సమస్యను ఐటి సర్వ్ అలయన్స్ సకాలంలో గుర్తించి వెంటనే టెక్సాస్ కోర్టులో పిటిషన్ వేయడం వలననే     యుఎస్ఐసిఎస్ తన నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. కనుక ఈ క్రెడిట్ ఖచ్చితంగా ఐటి సర్వ్ అలయన్స్ కే దక్కుతుంది. అమెరికాలోని సుమారు 1,000కి పైగా ఐటి సంస్థలు కలిసి ఏర్పాటు చేసుకొన్నదే ఐటి సర్వ్ అలయన్స్. మారిన ప్రభుత్వ విధానాల వలన అమెరికాలో ఐటి రంగం నిత్యం అనేక సవాళ్ళు ఎదుర్కొంటోంది. ఐటి సర్వ్ అలయన్స్ ఇటువంటి సవాళ్లను అధిగమించేందుకు నిత్యం కృషి చేస్తూనే మరోపక్క అమెరికాలో ఐటి రంగం అభివృద్ధికి కూడా చాలా దోహదపడుతోంది.

Related Post