పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్

August 18, 2018
img

పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు. పాక్ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. జూలై 25న జరిగిన పాక్ సార్వత్రిక ఎన్నికలలో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పిటిఐ 116 సీట్లు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆనవాయితీ ప్రకారం పాక్ పార్లమెంట్ (నేషనల్ అసెంబ్లీ)లో ప్రధానమంత్రి అభ్యర్ధి ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా ఆయనకు 176 మంది మద్దతు పలుకగా, ప్రత్యర్ధి షాబాజ్ కు 96 మంది మాత్రమే మద్దతు పలకడంతో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 

ఇమ్రాన్ ఖాన్ 1982 నుంచి 1992 వరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు కెప్టెన్‌గా చేశారు. భారత్ తో పలు మ్యాచ్ లు ఆడారు కనుక భారత్ క్రికెట్ టీం సభ్యులతో పాటు వివిద రంగాలకు చెందిన అనేకమంది భారతీయ ప్రముఖులతో ఆయనకు మంచి స్నేహసబంధాలున్నాయి. కనుక ఆయన భారత్ తో స్నేహసంబంధాలు బలపడేందుకు గట్టిగా కృషి చేస్తారనే నమ్మకం ఉంది. కానీ పాక్ అంతర్గత రాజకీయాలు, ప్రభుత్వంపై సైన్యం, తీవ్రవాదుల పెత్తనం వంటి కారణాల చేత ఆయన కూడా భారత్ పట్ల శత్రుభావం ప్రదర్శించినట్లయితే ఇక భారత్-పాక్ సంబంధాలు ఎప్పటికీ చక్కబడవని భావించవచ్చు.

Related Post