అమెరికాలో ముగ్గురు భారతీయులు హత్య

August 17, 2018
img

అమెరికాలో నివశిస్తున్న భారతీయులపై జాత్యాహంకారుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గత నెల 31వ తేదీన సుర్జీత్ మహ్లీ (50) అనే భారతీయుడిని ఒక గుర్తు తెలియని వ్యక్తి హత్య చేశాడు. ఈనెల 6వ తేదీన కాలిఫోర్నియాలోని మౌంటెకా కౌంటీలో సాహెబ్ సింగ్ (71) అనే మరో భారతీయుడిని మెక్ అలిస్టర్ అనే వ్యక్తి హత్య చేశాడు. హత్య చేయబడిన ఇద్దరు వ్యక్తులు పంజాబ్ కు చెందిన సిక్కులే కావడం గమనార్హం. వారిద్దరి హత్యలలో అమెరికాలో స్థిరపడిన సిక్కులు చాలా అంధోళన చెందుతుండగా నిన్న (గురువారం) ఉదయం న్యూజెర్సీలో ఎసెక్స్‌ కౌంటీలో తెర్లోక్ సింగ్ అనే మరొక సిక్కు వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఆయన ఆ ప్రాంతంలో చాలా కాలంగా ఒక స్టోర్ నడిపిస్తున్నాడు. రోజూలాగే గురువారం ఉదయం తన స్టోర్ తెరిచి పనిచేసుకొంటున్నాడు. కొంతసేపటి తరువాత ఆ స్టోర్ కు వచ్చినవారు అతను మరణించి ఉండటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాధమిక సమాచారం ప్రకారం తెర్లోక్ సింగ్ ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తోంది. కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. తెర్లోక్ సింగ్ కు భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Related Post