అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులు?

August 09, 2018
img

అమెరికాలో స్థిరపడాలనే భారతీయుల తాపత్రయం నానాటికీ పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (డి.హెచ్.ఎస్) తాజాగా ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న పది దేశాలకు చెందినవారిలో భారత్ మొదటిస్థానంలో ఉందని తన నివేదికలో పేర్కొంది. 

2016లో సుమారు పది లక్షల మంది భారతీయులు వ్యాపారాలు, విద్యాభ్యాసం, వైద్య చికిత్సల కోసం బి-1, బి-2 వీసాలతో అమెరికాకు వచ్చారు. వారిలో 17,763 మంది తమకు అనుమతించిన గడువుకంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నారు. వారిలో 2,040 మంది మాత్రమే భారత్ తిరిగి వెళ్ళిపోగా మిగిలిన 15,723 మంది నేటికీ అమెరికాలో వీసా లేకుండానే నివసిస్తున్నారని డి.హెచ్.ఎస్. తన నివేదికలో పేర్కొంది. 

ఇక 2017లో 10.7 లక్షల మంది అమెరికాకు రాగా వారిలో 14,204 మంది తమ వీసా కాలపరిమితి ముగిసిన తరువాత అమెరికాలో ఉన్నారు. వారిలో 1,706 మంది మాత్రమే వెనక్కు తిరిగి వెళ్ళినట్లు ఆధారాలున్నాయని మిగిలిన 12,498 మంది నేటికీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని డి.హెచ్.ఎస్. పేర్కొంది. 

ఇక 2017లో 4.5 లక్షల మంది నాన్-ఇమ్మిగ్రెంట్స్ ఇండియన్స్ భారత్ తిరిగి వెళ్ళవలసి ఉండగా, వారిలో 9,568 మంది తమకు ఇచ్చిన గడువు కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్నారు. వారిలో  3,956మంది మాత్రమే భారత్ తిరిగివెళ్ళిపోగా మిగిలిన 6,612 మంది నేటికీ అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని ఆ నివేదికలో పేర్కొంది. 

అమెరికాలో అక్రమంగా ఉంటునవారిలో బి-1, బి-2 వీసాలపై వచ్చినవారే ఎక్కువగా ఉన్నారని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ తన తాజా నివేదికలో పేర్కొంది.

Related Post