ఇమ్రాన్ సెంచరీ కొట్టాడు కానీ...

July 27, 2018
img

పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సెంచరీ కొట్టాడు కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 137 సీట్లు సాధించలేకపోయాడు. మొత్తం 272 సీట్లున్న పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పిటిఐ 110 సీట్లు గెలుచుకోగలిగింది. అయితే పిటిఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది కనుక మిగిలిన పార్టీలలో ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటుచేయడం, ఆ తరువాత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధాని కావడం ఖాయమేనని చెప్పవచ్చు. 

ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, “భారత్-పాక్ సంబంధాలను మళ్ళీ పునర్నిర్వచించుకోవలసిన అవసరం ఉంది. గతం త్రవ్వుకొని విద్వేషాలు కొనసాగించడం కంటే ఇరుదేశాలు మళ్ళీ చర్చలకు ఉపక్రమించి అన్ని సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకొని ముందుకు సాగాలని నేను కోరుకొంటున్నాను,” అని అన్నారు.

నిజానికి భారత్ ఎప్పుడూ ఇరుగు పొరుగు దేశాలతో శాంతినే కోరుకొంటుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ ను పాలించిన ప్రధానులు అందరూ పాకిస్తాన్ కు స్నేహహస్తమే అందించారు కానీ పాక్ పాలకులు తమ అంతర్గత సమస్యల కారణంగా భారత్ అందిస్తున్న స్నేహ హస్తాన్ని అందుకోవడానికి ఇష్టపడలేదు. అందుకొని ఉండి ఉంటే పాకిస్తాన్ నేడున్న పరిస్థితులలో ఉండేది కాదు. అన్ని రంగాలలో భారత్ తో పోటీ పడుతుండేది.

ఇమ్రాన్ ఖాన్ చెప్పినట్లు ఇప్పుడు గతం తవ్వుకోవడం అనవసరం. కానీ ముందుగా ఆయన తన సమర్ధతను నిరూపించుకోవలసి ఉంటుంది. అయన పాక్ సైన్యం, ఉగ్రవాదుల ప్రభావానికి లొంగకుండా వ్యవహరించగలిగితే పాకిస్తాన్ తప్పకుండా బాగుపడుతుంది. అయన పాక్ లో తిష్ట వేసుకొన్న ఉగ్రవాదులను ఏరిపారేయగలిగితే 50 శాతం విజయం సాధించినట్లే. మరి అది అయన వల్ల అవుతుందా లేదా? అయన కూడా గతంలో పాక్ పాలకుల బాటలోనే నడుస్తారా? అనే సంగతి అతి త్వరలోనే తేలిపోతుంది.

Related Post