ప్రాణం తీస్తున్న అమెరికా చదువులు

July 26, 2018
img

అమెరికాలో ఉన్నత చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు సంపాదించుకొని గొప్పగా జీవించాలనే యువత కోరిక వారి ప్రాణాల మీదకు తెస్తోంది. హైదరాబాద్ లో సంతోష్ నగర్ కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ మూడేళ్ళ క్రితం న్యూజెర్సీలోని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు. అక్కడ చదువుకొంటూనే తన ఖర్చుల కోసం న్యూయార్క్ లోని ఒక మొబైల్ షాపులో గత ఆరు నెలలుగా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. 

ప్రతీరోజూ తల్లితండ్రులకు, తమ్ముడికి ఫోన్ చేసి అక్కడ అంతా బాగానే ఉందని, చదువు చక్కగా సాగుతోందని చెప్పేవాడు. రోజూలాగే ఈనెల 20వ తేదీన ఇంటికి ఫోన్ చేసి తల్లితో సుమారు గంటసేపు మాట్లాడాడు. అప్పుడు తమ్ముడు మీర్జా షుజాత్‌ బేగ్‌ గురించి పదేపదే అడగడంతో తల్లికి అనుమానం వచ్చి ప్రశ్నిస్తే, అక్కడ మనదేశానికి చెందినవారే కొందరు తనను చాలా ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతూ చెప్పాడు. ఆ తరువాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. 

ఆ తరువాత అతని తమ్ముడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్-ఆఫ్ అని సందేశం రావడంతో ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. వెంటనే వారు అతని రూమ్ మేట్స్ కు ఫోన్ చేశారు కానీ ఎవరూ స్పందించలేదు. ఇస్మాయిల్ పనిచేస్తున్న మొబైల్ షాప్ యజమానికి ఫోన్ చేస్తే “మీ అబ్బాయి చెప్పాపెట్టకుండ కౌంటర్ వదిలి వెళ్ళిపోయాడు” అని సమాధానం చెప్పాడు. దీంతో అతని తల్లితండ్రులు మహమ్మద్‌ ఇస్మాయిల్‌, మేరాజ్‌ బేగం, తమ్ముడు బేగ్ తీవ్ర ఆందోళన చెందుతూ న్యూజెర్సీలోని తెలిసినవారందరికీ ఫోన్ చేసి ఇస్మాయిల్ గురించి తెలుసుకొనే ప్రయత్నాలు చేశారు. కానీ అతను తన రూమ్ లో లేడని వారు తెలపడంతో అక్కడ తెలిసినవారి సహాయంతో పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వెంటనే అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జూలై 20వ తేదీన కనబడకుండా పోయిన ఇస్మాయిల్ ఆచూకి ఇంతవరకు తెలియలేదు. 

కుమారురు ఎక్కడున్నాడో..ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్న అతని తల్లితండ్రులు విదేశీవ్యవహారాలశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కు లేఖ వ్రాసి ఆమె సహాయం అర్ధించారు. ఈలోగా మీడియా, స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం అర్దించే ప్రయత్నం చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలలో నివసిస్తున్న ఆంధ్రా, తెలంగాణావాసులు ఎవరికైనా మహమ్మద్ ఇస్మాయిల్ ఆచూకి తెలిసినట్లయితే పోలీసులకు తెలియజేయవలసిందిగా అతని తల్లితండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.       


Related Post