పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్?

July 26, 2018
img

బుధవారం జరిగిన పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలలో మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పిటిఐ పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. కనుక అయన పాక్ ప్రధాని అయ్యే అవకాశం ఉంది. బుధవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొదలైంది. పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో మొత్తం 272 స్థానాలకు పిటిఐ-113స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. నవాజ్ షరీఫ్ కు చెందిన పిఎంఎల్-ఎన్-64, పిపిపి-43, ఎంక్యూఎం-5, ఎంఎంఏ-9 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. గత మూడు దశాబ్దాలుగా ఈ అవకాశం కోసం ఎదురుచూపులు చూసిన ఇమ్రాన్ ఖాన్ ఎట్టకేలకు ఈ ఎన్నికలలో విజయం సాధించి పాక్ ప్రధానమంత్రి కాబోతున్నారు. 

భారత్, పాక్ దేశాలకు కొన్ని గంటల వ్యవధి తేడాతో ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ ఏడు దశాబ్దాలలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించగా పాక్ పాలకుల అసమర్ధత, అవినీతి కారణంగా పాకిస్తాన్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. దానికి తోడు భారత్ పై ద్వేషంతో ఉగ్రవాదులను పెంచి పోషించడం వలన దేశంలో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ సరిపోవన్నట్లు పాక్ ప్రభుత్వంపై పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థలు పెత్తనం చలాయిస్తుండటంతో దాని చేతులు కట్టేసినట్లయింది. ఇమ్రాన్ ఖాన్ అయినా ఆ దేశాన్ని గాడిన పెడతారో లేదో చూడాలి. 

Related Post