విజయ్ మాల్యా కరుణిస్తాడా?

July 25, 2018
img

ఒక బ్యాంక్ ఉద్యోగి లేదా మరెవరైనా బ్యాంకును మోసం చేసినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి జైల్లో పడేస్తుంటారు. కానీ విజయ్ మాల్య, నీరవ్ మోడీ వంటి బడాబాబులు ఖచ్చితంగా తమను మోసం చేస్తారని తెలిసికూడా బ్యాంకులే వారికి వేలకోట్లు అప్పులిచ్చి ఆనక వారు విదేశాలకు పారిపోయినప్పుడు లబోదిబోమని మొత్తుకొంటుంటాయి. వారి వద్ద నుంచి ఆ బకాయిలను వసూలు చేసుకోలేక వాటిని మొండిబకాయిల పద్దులో వ్రాసేసుకొని మాఫీ చేసేసి, ఆ భారాన్ని సామాన్య ప్రజలపై రుద్దుతుంటాయి. అందుకే ప్రజలు బ్యాంకులపై నమ్మకం కోల్పోతున్నారని చెప్పవచ్చు.    

 ఇక విషయం ఏమిటంటే, దేశంలో 17 బ్యాంకులకు రూ.9,000 కోట్లు కుచ్చుటోపీ పెట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా చుట్టూ తాడు బిగుసుకొంటుండటంతో భారత్ వచ్చి తనపై కేసులను ఎదుర్కొనేందుకు సిద్దమని చెప్పినట్లు తాజా సమాచారం. ఎందుకంటే, విజయ్ మాల్యా వంటి పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకొనేందుకు వీలుగా కొత్తగా అమలులోకి తెచ్చిన చట్టమే అందుకు కారణంగా కనిపిస్తోంది. 

ఇప్పటికే అనేక బ్యాంకులు అతనిపై సుప్రీంకోర్టు, ఈడి, ఏసిబి కోర్టులలో పిటిషన్లు వేశాయి. ఒకవేళ ఆ కేసులలో న్యాయస్థానాలు అతనిని పారిపోయిన ఆర్ధిక నేరగాడిగా ప్రకటిస్తే మరుక్షణం అతనికి చెందిన 12,500 కోట్లు విలువైన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేయవచ్చు. అదీగాక లండన్ కోర్టులో అతనిని భారత్ కు అప్పగింత కేసుపై విచారణ తుది దశకు చేరుకొంది. లండన్ కోర్టు కూడా భారత్ అభ్యర్ధన పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అంటే విజయ్ మాల్యా భారత్ రాకూడదని అనుకొన్నప్పటికీ, కోర్టు సమ్మతిస్తే ఈడి అధికారులు అతనిని బలవంతంగా భారత్ కు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే విజయ్ మాల్యా తాను భారత్ రావాలనుకొంటున్నానని తన ప్రతినిధుల ద్వారా ఈడి అధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కనుక విజయ్ మాల్యా విధిలేని పరిస్థితులలోనే భారత్ వచ్చేందుకు సిద్దపడుతున్నాడు తప్ప తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనేందుకు మాత్రం కాదు. కానీ అతను నిజంగా భారత్ వస్తాడా లేదా అనే విషయం ఎవరూ చెప్పలేరు. వస్తే అతనికి అప్పిచ్చిన బ్యాంకుల అదృష్టమే.

Related Post