ట్రంప్ సర్కార్ నిర్ణయాన్ని సవాలు చేసిన ఐటిసర్వ్ అలయన్స్

July 17, 2018
img

అమెరికాలో విదేశీయులను తగ్గించుకునేందుకు, కొత్తగా వచ్చేవారిని అడ్డుకొనేందుకు ట్రంప్ సర్కార్ వీసాల మంజూరుకు ఇప్పటికే అనేక ఆంక్షలు విధించింది. విదేశీ విద్యార్ధులకు, వారికి ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు భవిష్యత్ లో హెచ్-1 బి వీసాలు లభించకుండా కట్టడి చేసేందుకు ట్రంప్ సర్కార్ గుట్టు చప్పుడు కాకుండా మరొక కొత్త నిబంధన తాజాగా అమలులోకి తెచ్చింది. 

సాధారణంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసాలపై అమెరికాలో ఉన్నత విద్యలభ్యసిస్తున్న విదేశీవిద్యార్దులకు తమ చదువులు పూర్తయిన తరువాత ఓపిటి (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) క్రింద ఒక ఏడాదిపాటు ఏదైనా సంస్థలో చేరి సాంకేతిక శిక్షణ పొందవచ్చు. అది పూర్తి చేసిన తరువాత మరో 24 నెలలు పనిచేసుకొనేందుకు అనుమతి లభిస్తుంది. ‘స్టెమ్ ఓపిటి’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాధ్స్ రంగాలలో ) ఉన్నత విద్యలభ్యసించినవారికి ఇది వర్తిస్తుంది. 


సాధారణంగా చాలా సంస్థలు వివిధ పనుల కోసం ఒకదానితో మరొకటి ఒప్పందాలు కుదుర్చుకొంటాయి. అప్పుడు అవి తమ వద్ద పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను ఆ పనులు చేసేందుకు ఆ సంస్థలకు పంపిస్తుంటాయి. అదేవిధంగా ‘స్టెమ్ ఓపిటి’ విధానంలో ఉద్యోగాలలో చేర్చుకొన్నవారిని ఆ సంస్థలు ఇతర సంస్థలకు పంపించి వారి పనులు చేయిస్తుంటాయి. కానీ ట్రంప్ సర్కార్ కొత్తగా అమలులోకి తెచ్చిన నిబంధన ప్రకారం ఏ సంస్థలో చేరినవారు అదే సంస్థలో పనిచేయాలి తప్ప వేరే సంస్థలలో (ధర్డ్ పార్టీ కోసం) పనిచేయడాన్ని నిషేదించింది. ఆమేరకు యు.ఎస్.సి.ఐ.ఎస్.(యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసస్) వెబ్ సైటులో నిబంధనలు మార్చింది. దీని వలన అటు విదేశీవిద్యార్ధులు ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అలాగే ఒక సంస్థ వేరొక సంస్థతో చేసుకొన్న ఒప్పందాల ప్రకారం సకాలంలో పనులు పూర్తిచేయలేని పరిస్థితులు ఏర్పడతాయి.  

అసాధారణమైన లేదా అత్యున్నతమైన నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల కోసమే హెచ్-1 బి వీసాలు మంజూరు చేయాలని, సాధారణ ఉద్యోగాలకు వీలులేదని ట్రంప్ సర్కార్ విధించిన ఆంక్షలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న విదేశీయులకు, సంస్థలకు ఈ తాజా నిబంధనతో చేతులు కట్టేసినట్లయింది. హెచ్-1 బి వీసాల మంజూరు, ఉద్యోగాల భర్తీ విషయంలో ట్రంప్ సర్కార్ తీసుకొంటున్న వివాదాస్పద నిర్ణయాలతో ఇప్పటికే అనేక సంస్థలు ఉద్యోగుల నియామకాలకు, ఒప్పుకొన్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. 

కనుక అమెరికాలోని సుమారు 1,000 ఐటి సంస్థలు కలిసి ఏర్పాటు చేసుకొన్న ‘ఐటి సర్వ్ అలయన్స్’ ట్రంప్ సర్కార్ తీసుకొన్న ఈ తాజా నిర్ణయాన్ని సవాలు చేస్తూ జూలై 14వ తేదీన టెక్సాస్ కోర్టులో ఒక పిటిషన్ వేసింది. 

అమెరికాలో ఉన్నత విద్యలు పూర్తి చేసుకొన్న విద్యార్ధులకు స్టెమ్ ఓపిటి క్రింద గరిష్టంగా మూడేళ్ళపాటు ఏదైనా సంస్థలలో పనిచేసేందుకు వీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం దానిని నిరాకరిస్తోందని, దాని వలన భవిష్యత్ లో ఏ సంస్థ హెచ్-1 బి వీసాలు పొందలేని పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ నిబంధనపై స్టే విధించాలని ఐటి సర్వ్ అలయన్స్ తన పిటిషనులో న్యాయస్థానాన్ని కోరింది. 

ట్రంప్ విదేశీ, ఉద్యోగ విధానాలను తప్పు పడుతూ ఇప్పటికే పలు కోర్టులలో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా 1,000 ఐటి కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐటి సర్వ్ అలయన్స్ కూడా పిటిషన్ వేయడంతో ట్రంప్ సర్కార్ పునరాలోచన చేస్తుందని అందరూ ఆశిస్తున్నారు.

Related Post