థాయిలాండ్ చిన్నారుల కధ సుఖాంతం

July 10, 2018
img

థాయిలాండ్ లో ఒక గుహలో చిక్కుకుపోయిన 12 మంది చిన్నారుల కధ సుఖాంతమైంది. తమ ఫుట్ బాల్ కోచ్ తో కలిసి మూడువారాల క్రితం ఒక పొడవైన గుహలోకి ప్రవేశించారు. వారు గుహలోకి వెళ్ళిన తరువాత బారీ వర్షాల కారణంగా గుహలో బురద నీళ్ళు నిండిపోయాయి. దాంతో వారు గుహ లోపల చిక్కుకుపోయారు. వారు ఆ గుహలో చిక్కుకుపోయారని కనుక్కోవడానికే మూడు నాలుగు రోజులు పట్టింది. అప్పటి నుంచి వారిని రక్షించడానికి థాయిలాండ్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. చివరకు థాయిలాండ్ కు చెందిన ఇద్దరు నేవీ డైవర్లు ప్రాణాలకు తెగించి లోపలకు వెళ్లి పిల్లలకు అవసరమైన ఆహారపదార్ధాలు, మొబైల్ ఫోన్స్ వగైరా అందించారు. కానీ వారు తిరిగి వస్తుననపుడు సిలిండరులో ఆక్సిజన్ అయిపోవడంతో సమన్ కునన్‌ అనే డైవర్ మృతి చెందాడు. కానీ వారు అందించిన సహాయం కారణంగానే గుహలో 12 మంది పిల్లలకు బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడ్డాయి. 


అప్పటి నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చేందుకు అనేకమంది నిపుణులు తీవ్రంగా శ్రమించారు. గుహలో నుంచి కొన్ని లక్షల లీటర్ల నీళ్ళు మోటర్లతో బయటకు తోడిపోస్తూ గుహలో నుంచి ఒకరొకరిగా పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. 


వారు ఈవిధంగా గుహలో చిక్కుకు పోవడానికి వారి కోచ్ కారణమైనప్పటికీ అతనే వారికి ధైర్యం నూరిపోస్తూ, వారికి తన ఆహారమంతా ఇచ్చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి వారి ప్రాణాలను కాపాడాడు. కనుక థాయిలాండ్ తో సహా ప్రపంచదేశాలలో అతనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అతనిని నిందిస్తుంటే మరికొంతమంది అతను పిల్లలను కాపాడటానికి చేసిన కృషికి మెచ్చుకొంటున్నారు. 

చివరికి సహాయబృందాలు చేసిన కృషి ఫలించి ఇవాళ్ళ కోచ్ తో సహా గుహలో చిక్కుకొన్న పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రపంచదేశాలన్నీ వారిని అభినందనలు తెలియజేస్తున్నాయి. 


ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రపంచంలో కెల్లా అత్యుత్తమైనదని థాయిలాండ్ నేవీ సిబ్బంది అత్యద్భుతంగా దానిని పూర్తిచేశారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 



ఆ గుహ లోపలి భాగం ఏవిధంగా ఉందో ఈ వీడియోలో చూస్తే అటువంటి గుహలో నుంచి ఎవరూ ప్రాణాలతో బయటపడలేరని ఎవరైనా అంగీకరిస్తారు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు థాయిలాండ్ నేవీ సిబ్బంది తదితరులు. 


Related Post