అమెరికాలో తెలంగాణా యువకుడు మృతి

July 09, 2018
img

ఉన్నత చదువులు చదువుకునేందుకు అమెరికా వెళ్ళిన కొప్పుల శరత్ (26) అనే ఒక తెలంగాణా యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి తుపాకీతో కాల్పులు జరుపడంతో మృతి చెందాడు. శరత్ ఎంఎస్ చదివేందుకు కెన్సస్ వెళ్ళాడు. అక్కడ చదువుకుంటూనే ఒక స్థానిక రెస్టారెంట్ లో క్యాషియర్ గా పార్ట్-టైం ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం శుక్రవారం రాత్రి ఒక గుర్తు తెలియని నల్లజాతీయుడు రెస్టారెంట్ కు వచ్చాడు. అతను బిల్లు చెల్లించకుండా వెళ్ళిపోతుండటం చూసి శరత్ అతనిని బిల్లు చెల్లించమని గట్టిగా అడిగాడు. అంతే...అతను జేబులో నుంచి తుపాకీ తీసి శరత్ పై కాల్పులు జరిపాడు. శరత్ ఛాతిలోకి ఐదు తూటాలు దూసుకుపోవడం ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకొని హైదరాబాద్ లో అతని తల్లి తండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

శరత్ తండ్రి కొప్పు రామ్మోహన్ అమీర్ పేట బి.ఎస్.ఎన్.ఎల్. కార్యాలయంలో జెఈఓగా పనిచేస్తున్నారు. శరత్ తల్లి మాలతి పంచాయితీ రాజ్ శాఖలో పనిచేస్తునారు. శరత్ అమెరికా వెళ్ళక మునుపు హైదరాబాద్ హైటెక్ సిటీలో పెగా సిస్టం అనే ఒక సంస్థలో పనిచేసేవాడు. అంతా సుఖంగా, సంతోషంగా సాగిపోతోందనుకుంటే శరత్ మరణంతో వారి కుటుంబంలో పెనువిషాదం సంభవించింది. 

ఈ సంగతి తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటిఆర్, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అమీర్ పేటలో శరత్ తల్లి తండ్రుల నివాసానికి వెళ్లి వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. శరత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా హైదరాబాద్ రప్పించేందుకు కృషి చేస్తామని, శరత్ తల్లితండ్రులు లేదా దగ్గర బందువులు ఎవరైనా అమెరికా వెళ్ళదలిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. రెండు మూడు రోజులలో శరత్ మృతదేహం హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.    


Related Post