ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు సుప్రీంకోర్టు ఆమోదం

June 27, 2018
img

డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తరువాత తీసుకొంటున్న నిర్ణయాలలో అత్యధికం వివాదస్పదమైనవేనని అందరికీ తెలుసు. వాటిలో ఒకటైన ‘ట్రావెల్ బ్యాన్’ కు అమెరికా సుప్రీంకోర్టు మంగళవారం ఆమోదం తెలిపింది. 

లిబియా, ఇరాన్, ఇరాక్, సిరియా, యెమెన్, వెనిజులా, ఉత్తరకొరియా, చాడ్ దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్ సర్కార్ నిషేధం విధించింది. దానిపై సర్వత్రా వ్యతిరేకత ఎదురైంది. అమెరికా ఫెడరల్ కోర్టులు కూడా దానిని తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో ట్రంప్ సర్కార్ కొంచెం వెనక్కు తగ్గింది. 

ఈ అంశంపై తొమ్మిదిమందితో కూడిన అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ తో సహా ఐదుగురు న్యాయమూర్తులు ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను సమర్ధించగా, నలుగురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. 

దీంతో ట్రంప్ ట్రావెల్ బ్యాన్ మళ్ళీ అమలులోకి రాబోతోంది. ఆ జాబితా నుంచి ఇరాక్, చాడ్ దేశాలను ట్రంప్ సర్కార్ ఇదివరకే తొలగించింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదం తెలుపడంతో కొత్తగా మరిన్ని దేశాలపేర్లను చేర్చే అవకాశం ఉంది. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించి ప్రోత్సహిస్తున్న కారణంగా పాకిస్తాన్ ను ‘గ్రే’ జాబితాలో పెట్టాలని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదే నిజమైతే పాకిస్తాన్ దేశాన్ని కూడా ఈ ట్రావెల్ బ్యాన్ జాబితాలో చేర్చినా ఆశ్చర్యం లేదు. 

Related Post