సౌదీ మహిళలకు అర్ధరాత్రి స్వాతంత్ర్యం

June 25, 2018
img

సౌదీ అరేబియా దేశంలో మహిళలకు ఆదివారం అర్దరాత్రి నుంచి స్వాతంత్ర్యం లభించింది. వారు కార్లు నడపటంపై దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్ 24వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎత్తివేయడంతో వేలాదిమంది సౌదీ మహిళలు తమ కార్లకు బెలూన్లు కట్టుకొని రోడ్లపై హుషారుగా కేరింతలు కొడుతూ వాహనాలు నడిపించారు. ఆ సమయంలో వారి కళ్ళలో కనిపించిన ఆనందం మాటలతో వర్ణించగలిగేది కాదు. కొత్తగా రెక్కలు వచ్చిన పక్షుల్లా రయ్యిరయ్యిమంటూ వాహనాలలో దూసుకుపోయారు. కొంతమంది మహిళలు తమ భర్త, పిల్లలను, కొంతమంది యువతులు తమ తల్లితండ్రులను కూర్చోబెట్టుకొని ఆనందంగా కార్లు నడిపించారు. నిన్న రాత్రి మొదటిసారిగా వాహనాలు నడిపిన మహిళలలో చాలా మంది ఒకే మాట చెప్పారు. తమ జీవితంలో మొట్టమొదటిసారిగా స్వేచ్చ లభించినట్లు అనుభూతి కలుగుతోందని చెప్పారు. దానిని బట్టి వారు స్వేచ్చ కోసం ఎంతగా పరితపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

సౌదీ కుటుంబాలలో ఎంత ధనవంతులైనప్పటికీ మహిళలకు వాహనాలు నడిపేందుకు అనుమతి ఉండేది కాదు. కనుక కుటుంబంలో పురుషులు ఎవరైనా తీసుకువవెళ్ళవలసి వచ్చేది. కానీ గత కొన్నేళ్లుగా సౌదీ రాచప్రభుత్వం సంస్కరణల బాట పట్టి మహిళలపై ఉన్న ఆంక్షలను ఒకటొకటిగా తొలగిస్తోంది. వాటిలో భాగంగానే ఈ సంస్కరణ కూడా. అయితే సౌదీ అరేబియా దేశంలో మహిళా స్వేచ్చకు ఇంకా అనేక సంస్కరణలు జరుగవలసి ఉంది. 

Related Post