అఫ్గానిస్థాన్ లో ఏడుగురు భారతీయులు కిడ్నాప్!

May 07, 2018
img

అఫ్గానిస్థాన్ లో తీవ్రవాదులు ఏడుగురు భారతీయులను కిడ్నాప్ చేశారు. వారందరూ ఉత్తర బగ్లాని జదీద్ ప్రావిన్స్ లో గల ఒక ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. రోజూలాగే వారు ఆదివారం ఉదయం తమ సంస్థకు చెందిన మినీబస్సులో విధులకు హాజరయ్యేందుకు వెళుతుంటే కొందరు తీవ్రవాదులు తుపాకులు చూపి వారి వాహనాన్ని అడ్డుకొని అఫ్గన్ డ్రైవరుతో సహా ఏడుగురు భారతీయులను కిడ్నాప్ చేశారు. ఈ వార్తను ఈబగ్లాన్ పోలీస్ అధికారి జబీబుల్లా షుజా, కాబూల్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు దృవీకరించారు. వారిని తాలిబన్ ఉగ్రవాదులు చెరపట్టి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అఫ్గానిస్థాన్ లో తాలిబాన్ ఉగ్రవాదులు డబ్బు కోసం కిడ్నాపులు చేస్తుండటం మామూలేనని బగ్లాని పోలీస్ అధికారి జబీబుల్లా షుజా అన్నారు. సాధారణంగా చలీకాలం ముగిసినప్పటి నుంచి దేశంలో తాలిబన్ల హడావుడి మొదలవుతుందని చెప్పారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న ఏడుగురు భారతీయులను విడిపించేందుకు కాబూల్ లోని దౌత్యదికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే వారిని విడిపించగలమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.


Related Post