డాలర్ డ్రీమ్స్ చెదిరిపోనున్నాయా?

April 24, 2018
img

అమెరికాలో స్థిరపడిన భారతీయులతో సహా విదేశీయులందరికీ ట్రంప్ సర్కార్ పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ సంస్థ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్సానా యుఎస్ సెనేట్ జ్యుడిషియరీ కమిటీకి వ్రాసిన ఒక లేఖ స్పష్టం చేసింది. అమెరికాలో హెచ్-1 బి వీసాల ద్వారా ఉద్యోగాలు చేస్తున్నవారి జీవితభాగస్వాములకు కూడా హెచ్-4 వీసా ద్వారా ఉద్యోగాలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ట్రంప్ సర్కార్ దానిని తొలగించడానికి సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఆ లేఖ ద్వారా తెలియజేశారు. అదే కనుక అమలులోకి వస్తే హెచ్-4 వీసాల ద్వారా ఉద్యోగాలు సంపాదించుకొన్నవారు ఇకపై ఇంటికే పరిమితం కావలసిఉంటుంది. అమెరికాలో దాదాపు లక్షమందికి పైగా భారతీయులు హెచ్-4 వీసాలపై ఉద్యోగాలు చేసుకొంటున్నారు. కుటుంబంలో ఒక్కరు సంపాదిస్తే మిగిలినవారందరూ దానిపై ఆధారపడి బ్రతకడం కష్టమనుకొంటే, తప్పనిసరిగా స్వదేశాలకు తిరిగివెళ్ళవలసిరావచ్చు. 

 హెచ్-1 బి వీసాల జారీపై ఇప్పటికే అనేక కటినమైన ఆంక్షలు విధించబడ్డాయి. వాటిని మరింత కటినం చేయడం ద్వారా ఆ ఉద్యోగాలు అమెరికన్లకు దక్కేలా చేయాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ముందుగా హెచ్-1 బి వీసాల జారీలో లాటరీ విధానంలో బారీగా మార్పులు చేయబోతున్నట్లు యుఎస్ ఇమ్మిగ్రేషన్ సంస్థ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్సానా తన లేఖలో పేర్కొన్నారు. అలాగే ‘డెఫినిషన్ ఆఫ్ స్పెషాలిటీ ఆక్యుపేషన్’ నిబంధనలను కూడా పునః సమీక్షించబోతునట్లు తెలిపారు. ఈ నిబంధనలకు అనేక సంస్థలు రకరకాల అర్ధాలు చెపుతూ ఇష్టారాజ్యంగా హెచ్-1 బి వీసాలపై విదేశీ ఉద్యోగులను చేర్చుకొంటున్నట్లు కనుగొన్నామని, కనుక వాటిని సమూలంగా మార్చబోతున్నట్లు ఫ్రాన్సిస్ సిస్సానా తెలిపారు. అలాగే క్షేత్రస్థాయిలో తనికీలు నిర్వహించి ఎల్-1 వర్కర్లను గుర్తిస్తామని లేఖలో తెలిపారు. హెచ్-1 బి, హెచ్-2బి, హెచ్-4 వీసాల జారీకి అనుసరిస్తున్న విధానాలను సమగ్రంగా సమీక్షించి అమెరికన్లకు మేలు కలిగేవిధంగా అవసరమైన మార్పులు చేయబోతున్నట్లు ఫ్రాన్సిస్ సిస్సానా తన లేఖలో పేర్కొన్నారు. 

ఈ వీసాల జారీలో ట్రంప్ సర్కార్ అవలంభిస్తున్న విధానాల వలన ప్రవాసభారతీయులతో సహా విదేశీయులందరికీ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ, ఆ సంస్కరణల వలన అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తుండటంతో అమెరికన్లు..ముఖ్యంగా నిరుద్యోగ అమెరికన్ యువత ట్రంప్ సర్కార్ విధానాలకు జేజేలు పలుకుతోంది. విదేశీయులకు అమెరికా ద్వారాలు మెల్లమెల్లగా మూసుకుపోతున్నాయని అర్ధం అవుతోంది. కనుక అందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొంటే మంచిదేమో? 

Related Post