అమెరికా కర్రపెత్తనం మానుకోదా?

April 16, 2018
img

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఆ తరువాత డోనాల్డ్ ట్రంప్ పదేపదే ఒకమాట చెపుతుండేవారు. ప్రపంచదేశాలను కాపాడవలసిన బాధ్యత అమెరికాది కాదని, అమెరికన్లు కట్టిన పన్నులతో ఇతరదేశాలను కాపాడవలసిన అవసరం తమకు లేదని చెప్పేవారు. ఇంతకాలం మోసిన ఆ భారం చాలని ఇక నుంచి అమెరికా తన దేశ భద్రత, అభివృద్ధిపైనే దృష్టి సారిస్తామని చెప్పేవారు. కానీ ప్రపంచదేశాలపై అమెరికా తన కర్రపెత్తనం మానుకోదని నిరూపిస్తూ ఉత్తర కొరియాతో జరిగిన మాటల యుద్ధం నిరూపించింది. మళ్ళీ ఇప్పుడు అమెరికా సంకీర్ణ దళాల వాయుసేనలు సిరియాపై బాంబుల వర్షం కురిపించాయి. సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులను నిర్మూలించేందుకే ఈదాడులు చేసినట్లు అమెరికా చెప్పుకొంటోంది. కానీ వాస్తవం అందరికీ తెలుసు. 

సిరియాలో ప్రభుత్వానికి, తిరుగుబాటుదారులకి మద్య చిరకాలంగా అంతర్యుద్దం జరుగుతోంది. వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేసేందుకు సిరియా అధ్యక్షుడు బసర్-అల్-అసద్ తన ప్రజలపైనే వాయుసేనతో బాంబుల వర్షం కురిపిస్తున్నాడు. అతనికి మద్దతుగా రష్యా మరికొన్ని దేశాలు నిలుస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ మరికొన్ని దేశాలు అతనిని వ్యతిరేకిస్తున్నాయి. కనుక సిరియా అంతర్యుద్దం పేరుతో అమెరికా, రష్యాలు ఇంతకాలం పరోక్షయుద్ధం చేస్తున్నాయి. ఆ యుద్ధంలో అమాయకులైన ప్రజలు, వేలాదిగా మహిళలు, పసిపిల్లలు బలైపోతున్నారు.            

సిరియా ప్రజలపై సిరియా ప్రభుత్వ సేనలు, రష్యా కలిసి రసాయన ఆయుధాలు ప్రయోగించాయని ఆరోపిస్తూ ఆ రసాయనాయుదాగారాలపై అమెరికా సంకీర్ణ దళాలు బాంబుల వర్షం కురిపించాయి. అది తమపై యుద్ధంగానే భావిస్తామని, అమెరికా ఇదేవిధంగా వ్యవహరిస్తే అది మూడో ప్రపంచయుద్ధానికి దారితీయవచ్చని రష్యా హెచ్చరించింది. 

ఇతరదేశాల భద్రత భాద్యత తమది కాదని చెప్పిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సిరియాలో వేలుపెట్టకుండా ఉండలేకపోతున్నారు. సిరియాలో జరిగింది..జరుగుతున్నదీ చాలా దారుణమే. కానీ ఆ సమస్యను పరిష్కరించవలసిన బాధ్యత ఐక్యరాజ్యసమితిదే తప్ప అమెరికా, రష్యాలది కాదు. కానీ రెండు దేశాలు తమకు అలవాటైన కర్ర పెత్తనం వదులుకోవడానికి ఇష్టపడక ఇతరదేశాల వ్యవహారాలలో వేలుపెడుతూనే ఉన్నాయి. 

సిరియాలో జరుగుతున్న ఈ మారణహోమంలో వేలాదిమంది ప్రజలు, పసిపిల్లలు చనిపోతున్నా అవి యుద్ధం ఆపడం లేదు. పైగా ఆ తప్పును సరిదిద్దడానికి అంటూ ఇంకా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించవలసిన ఐక్యరాజ్యసమితి చోద్యం చూస్తోంది.Related Post