హెచ్-1 బి వీసాలు...అగ్నిపరీక్షలు

April 02, 2018
img

అమెరికన్లకు ఉద్యోగావకాశాలు పెంచేందుకు ట్రంప్ సర్కార్ విదేశీ ఉద్యోగులు, అమెరికాకు సేవలు అందిస్తున్న విదేశీ సంస్థలను నియంత్రించేందుకు హెచ్-1 బి వీసాల జారీపై అనేక కటినమైన ఆంక్షలు విధిస్తోంది. భారత్ కు ఏటా 65,000 హెచ్-1 బి వీసాలు జారీ చేస్తోంది. ఈ వీసాలను త్వరగా పొందేందుకు అమలులో ఉన్న ప్రీమియం ప్రాసెసింగ్ ను కొన్ని రోజుల క్రితమే నిలిపి వేసింది. మళ్ళీ దానిని ఎప్పుడు ప్రారంభిస్తుందో ప్రకటించలేదు. కనుక అమెరికాకు వెళ్ళగోరే ఐటి, తదితర నిపుణులు అందరూ లాటరీ పద్ధతిలో లభించే హెచ్-1 బి వీసాల కోసం ఎదురుచూడవలసి ఉంటుంది. అవసరం, అవకాశాలను బట్టి గాక అదృష్టం బట్టే హెచ్-1 బి వీసాలు లభిస్తాయన్న మాట! కనుక ఎలాగైనా వీసా పొందాలనే ఉద్దేశ్యంతో ఒక అభ్యర్ధి ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలు చేసినట్లయితే అవి  తిరస్కరించబడతాయి. 

ఈ ఆర్ధిక సంవత్సరంలో జారీ చేయబోయే వీసాల కోసం ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించబోతున్నామని, వీసా జారీకి విధించిన ఆంక్షలన్నీ నిఖచ్చిగా అమలుచేయబోతున్నట్లు అమెరికా సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారు. హెచ్-1 బి వీసాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు తప్పని సరిగా తమ పాస్ పోర్ట్ కాపీలను జత చేయాల్సి ఉంటుంది. గత ఐదేళ్ళలో అభ్యర్ధులు వినియోగిచిన ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్స్, సోషల్ మీడియాకు సంబంధించిన వివరాలను అభ్యర్ధులు విధిగా దరఖాస్తులో పేర్కొనవలసి ఉంటుంది. ఈ ఆంక్షలను గమనిస్తే వీసాలు జారీ చేయడం కోసం కాక ఏదో ఒక కారణం చూపించి తిరస్కరించడానికే వాటిని విధించినట్లు అనిపిస్తోంది. కనుక ఇకపై హెచ్-1 బి వీసాలను పొందడం ఇంకా కష్టం కావచ్చు. 

Related Post