హెచ్-1 బి వీసాలపై సరికొత్త వివాదం

March 20, 2018
img

హెచ్-1 బి వీసాలపై అమెరికాలో మళ్ళీ సరికొత్త వివాదం మొదలైంది. శాన్ఫ్రాన్సిస్కో నగరంలో మెట్రో రైల్వే స్టేషన్లలో వాణిజ్య ప్రకటనల కోసం నిర్దేశించిన డిస్ ప్లే బోర్డులపై హెచ్-1 బి వీసాలను వ్యతిరేకిస్తూ బారీగా ప్రకటనలు దర్శనమిస్తున్నాయి.  

ఆ ప్రకటనలలో ఏముందంటే, “మీరు (అమెరికన్ వర్కర్స్) చాలా ఖరీదైనవారు కనుక ఉద్యోగాలకు అర్హులుకారని, మీ అవసరం లేదని కంపెనీలు భావిస్తున్నాయి. కాంగ్రెస్ (అమెరికన్ పార్లమెంట్)...అమెరికన్ వర్కర్లకే కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఈ హెచ్-1 బి వీసాలకు ముగింపు పలకాలి.”    

అత్యంత రద్దీగా ఉండే ఆ మార్గంలో సివిక్ సెంటర్, ఓక్ లాండ్ లోని 12, 19వ స్టేషన్లలో ఇంకా పలు స్టేషన్లలో ఈ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో, పలు రైళ్ళలోపల కూడా ఆ ప్రకటనలు కనిపించబోతున్నాయని సమాచారం.

ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. హెచ్-1 బి వీసాల మంజూరును గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రోగ్రసివ్స్ ఫర్ ఇమ్మిగ్రేషన్ మరియు యుఎస్ టెక్ వర్కర్స్ అనే రెండు సంస్థలు 80,000 డాలర్లు ఖర్చు చేసి నెలరోజుల పాటు ఆ ప్రకటనలు ప్రదర్శించడానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో హెచ్-1 బి వీసాలపై చర్చ మొదలవబోతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో ఈ ప్రకటనలు వెలిశాయి. 

మనకు హైదరాబాద్ మెట్రో వంటిదే శాన్ఫ్రాన్సిస్కో నగర ప్రజలకు బి.ఏఆర్.టి.(బే ఏరియా రాపిడ్ ట్రాన్స్పోర్ట్) రైల్వే వ్యవస్థ. దానిలో రోజుకు 425,000 మంది ప్రయాణిస్తుంటారు. వారిలో భారత్ తో సహా వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినవారు, హెచ్-1 బి వీసాలపై పనిచేస్తున్నవారు కూడా ప్రయాణిస్తుంటారు. ఈ ప్రకటనలు కేవలం స్టేషన్లకే పరిమితం కాలేదు. అవి సోషల్ మీడియా, వాట్స్ అప్ గ్రూప్స్ లకు కూడా కార్చిచ్చులాగ విస్తరిస్తున్నాయి. 

ఆ రైళ్ళలో నిత్యం ప్రయాణించే కొందరు ప్రవాసభారతీయులు ఆ ప్రకటనలపై స్పందిస్తూ, “మేము అనేక ఏళ్లుగా అమెరికాలో పనిచేస్తున్నాము కానీ ఎప్పుడూ ఇంత వ్యతిరేకతను చూడలేదు. ఎవరో జాత్యాహంకారులు ఈ ప్రకటనలను అంటించారనుకోవడానికి ఇదేమీ మారుమూల పల్లెటూరు కాదు కదా? నిత్యం లక్షలాదిమంది ప్రయాణించే ఈ స్టేషన్లలో ఒకవర్గం ప్రజలను రెచ్చగొట్టే ఇటువంటి ప్రకటనలు ప్రదర్శించడం మాకు దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మేము నిత్యం అమెరికన్లతో కలిసిమెలిసి పనిచేస్తుంటాము. ప్రయాణిస్తుంటాము. వారిని రెచ్చగొట్టే ఈ ప్రకటనల కారణంగా మాపై భౌతికదాడులు జరిగితే మా పరిస్థితి ఏమిటి?. ఇది మాకు చాలా భయాందోళనలు కలిగిస్తోంది,” అని అన్నారు. 

Related Post