ఖతర్ లో తెలంగాణావాసి ఆత్మహత్య

February 09, 2018
img

పొట్ట చేత్తో పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళుతున్న కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మంచిర్యాల జిల్లాలో జన్నారం మండలం బాదంపల్లికి చెందిన నాగరాజు (24) తన తల్లితండ్రులతో కలిసి జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం పెంబట్లకు వలస వచ్చారు. మంచిర్యాలలో ఉద్యోగం, ఉపాధి లభించడంలేదని వారు జగిత్యాల వస్తే అక్కడా వారికి అవే పరిస్థితులు ఎదురయ్యాయి. దాంతో నాగరాజు తల్లితండ్రులు ఏజంట్ మాయమాటలు నమ్మి ఊర్లో అప్పులు చేసి నాగరాజును ఖతర్ పంపించారు. అక్కడికి వెళ్ళి బోలెడు సంపాదించుకోవాలని నాగరాజు ఆశ పడలేదు. ఊళ్ళో తన తల్లితండ్రులను, తమ్ముడిని పోషించుకొనేందుకు సరిపడినంత సంపాదించుకొన్నా చాలనుకొన్నాడు. కానీ అంత దూరం వెళ్ళినా అతనికి మాత్రం జీతమైన చేతికి రాలేదు. ఒక కార్లు కడిగే చిన్న సంస్థలో చేరిన నాగరాజుకు మొదటి నెల జీతంలోనే కోసేసి చేతిలో పెట్టాడు ఆ సంస్థ యజమాని. అది అక్కడ కూడు, గూడుకే సరిపోదు ఇక ఇంటికి ఏమి పంపిస్తాడు? మరుసటి నెలలో జీతంలో మరింత కోత పెట్టాడు యజమాని. అది చూసి తీవ్ర నిరాశ నిస్పృహలకు లోనైన నాగరాజు, జగిత్యాల, మంచిర్యాలలోని తన స్నేహితులకు ఒక వాయిస్ మెసేజ్ పంపాడు. ఏమనంటే.. 

“హాయ్‌ ఫ్రెండ్స్‌!  అందరూ ఎట్లున్నరు..ఏం చేస్తున్నారు? ఇక్కడ మా కంపెనోళ్ళ చేతిలో నేను మోసపోయినా... జీతం డబ్బులు తక్కువ ఇచ్చిండ్రు. అందుకే పోయిన నెలలో అమ్మకు డబ్బు పంపించలే. వచ్చే నెల తప్పకుండా పంపిస్తానని అమ్మకు చెప్పా కానీ పోయిన నెలకంటే ఈ నెల జీతం ఇంకా తక్కువ వచ్చింది. అది కూడా ఇంకా నా చేతికి ఇవ్వలేదు.. ఇప్పుడు ఏం చేయాలో నాకు సమజవుతలేదు. అందుకే చనిపోవాలనుకుంటున్నా! అందరూ మంచిగా ఉండండి...ఇదే నా ఆఖరు మెసేజ్‌! మళ్ళీ జన్మంటూ ఉంటే మిమ్మల్ని కలుస్తా. రాజు, మహేష్, రాజేష్, విజ్జీ...అందరికీ బై..బై! నా గురించి తప్పుగా అనుకోకండి. ఇక ఉంటా!” 

గల్ఫ్ లో పనిచేస్తున్న కార్మికులలో చాలా మందికి ఇటువంటి కష్టాలే ఉన్నాయి. కొందరు ఓపికగా భరిస్తుంటారు. నాగరాజు వంటి కొందరు కన్నవాళ్ళను ఆదుకోలేకపోయామనే నిరాశ నిస్పృహలతో ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా జీవితాలు ముగించి కన్నవారికి తీరని శోకం మిగిల్చి వెళ్ళిపోతారు. ఈ కష్టాలు ఎన్నటికి తీరేనో?

Related Post