భారత్ కు ఇక కష్టమే!

February 06, 2018
img

సౌదీ అరేబియా కూడా ట్రంప్ బాటలోనే పయనిస్తూ తీసుకొన్న తాజా నిర్ణయం భారతీయుల పాలిట శాపంగా మారబోతోంది. 

సౌదీలో దినసరి కూలీలు మొదలు వైద్యులు, ప్రాజెక్టు మేనేజర్లు, ఇంజనీర్లు వంటి ఉన్నత పదవుల వరకు ఎక్కువగా భారతీయులే కనిపిస్తారు. ముఖ్యంగా కిరాణా, బట్టల దుఖాణాలు, హోటల్స్ మొదలైన చోట్ల ఉండే చిన్న ఉద్యోగాలలో భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. అయితే గత  రెండు మూడు దశాబ్దాలుగా సౌదీ అరేబియాలో కూడా క్రమంగా నిరుద్యోగం పెరుగుతుండటంతో సౌదీ ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలలో, కర్మాగారాలలో సౌదీ పౌరులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మెల్లమెల్లగా విదేశీయులను తగ్గించుకోసాగింది. ఆ కారణంగా నేడు సౌదీలో అన్ని రంగాలలో సౌదీ ఉద్యోగులే కనిపిస్తున్నారు. అయినప్పటికీ సౌదీలో నిరుద్యోగ సమస్య ఇంకా అదుపులోకి రాకపోవడంతో తాజాగా 12 రంగాలలో విదేశీయులను నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీ నుంచి కార్లు, మోటార్ బైక్స్ షో రూమ్స్, గృహాలంకరణ, ఫర్నీచర్, రెడీమేడ్ దుస్తుల దుఖాణాలలో విదేశీయులకు ఉద్యోగాలు నిషేదించింది. రెండవ దశలో వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నుంచి బిల్డింగ్ మెటీరియల్, వైద్య పరికరాలు, తివాచీలు, ఆటో స్పేర్ పార్టులు, మిఠాయి దుఖాణాలలో విదేశీయులకు ఉద్యోగాలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది. 

సౌదీలో ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకొంటే దానిని ఎవరూ వ్యతిరేకించడానికి, అభ్యంతరాలు చెప్పడానికి వీలు ఉండదు. అది శిలాశాసనమే. కనుక ఈ 12 రంగాలలో ఉన్న భారతీయులు అందరూ మరోదారి వెతుక్కోవలసి ఉంటుంది లేదా తప్పనిసరిగా భారత్ తిరిగి రావలసి ఉంటుంది. ఈ 12 రంగాలలో సుమారు 30 లక్షల మంది భారతీయులు, (ఒక కోటి 20 లక్షల మంది విదేశీయులు) పని చేస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి ఒకేసారి 30 లక్షల మంది భారతీయులు తిరిగి వస్తే దేశంలో నిరుద్యోగ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. అదేవిధంగా పొట్ట చేత్తో పట్టుకొని సౌదీ అరేబియా వెళ్ళే భారతీయ కార్మికులకు, ఉద్యోగులకు ఈ 12 రంగాల తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లే కనుక వారు ఇక్కడే జీవనోపాధి వెతుక్కోవలసి ఉంటుంది. 

ఈ నిర్ణయాన్ని అమలుచేయడానికి ఇంకా 9 నుంచి 12 నెలలు గడువు ఉన్నప్పటికీ, ఆలోగా ఆ 12 రంగాలలో విదేశీయులను తొలగించి వారి స్థానంలో సౌదీ ఉద్యోగులను నియమించుకోవలసి ఉంటుంది కనుక అతి త్వరలోనే ఈ సమస్య పెనుభూతంలాగ కళ్ళ ముందు ప్రత్యక్షమవడం ఖాయం. ఒకవేళ సౌదీఅరేబియా బాటలో మిగిలిన గల్ఫ్ దేశాలు కూడా నడిస్తే, అప్పుడు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. కనుక భారత్ సర్కార్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటి నుంచే ఆ సమస్యను ఎదుర్కోవడానికి అవసరమైన సన్నాహాలు చేసుకోవడం చాలా మంచిది. లేకుంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నా ప్రయోజనం ఉండదు. 

Related Post