ట్రంప్ కు మద్దతు తెలిపిన ప్రవాస భారతీయులు

February 05, 2018
img

ఇమ్మిగ్రేషన్ విధానాలలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న సంస్కరణలకు మద్దతు తెలుపుతూ అమెరికాలోని ప్రవాస భారతీయులు శనివారం వైట్ హౌస్ ఎదురుగా ర్యాలీ నిర్వహించారు. దీనిలో రిపబ్లికన్ హిందూ కాయిలేషన్, తానా, ది హిందు అండ్ ఇండియన్ కమ్యూనిటీలకు చెందిన వెయ్యి మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఇమ్మిగ్రేషన్ విధానాల ప్రకారం గ్రీన్ కార్డ్ పొందాలంటే ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. డోనాల్డ్ ట్రంప్ సర్కార్ దానిని సవరించి ప్రతిభ ఆధారంగా మజూరు చేయాలని భావిస్తోంది. దానికి ప్రవాసభారతీయులు మద్దతు తెలుపుతూనే హెచ్-1 బి వీసాలను, గ్రీన్ కార్డ్ జారీలో దేశాలవారీగా విధించిన పరిమితులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిరకాలంగా పెండింగులో ఉన్న గ్రీన్ కార్డ్ దరఖాస్తులను పరిష్కరించాలని వారు ఈర్యాలీ ద్వారా ట్రంప్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. చిన్నతనంలోనే తల్లితండ్రులతో కలిసి అమెరికా వచ్చి అక్కడే పెరిగి అక్కడే చదువుకొని అమెరికానే స్వదేశంగా భావిస్తున్న నవతరాన్ని అక్కున చేర్చుకొని వారినీ అమెరికా పౌరులుగా భావిస్తూ వారికీ సమానహక్కులు, గౌరవం కల్పించాలని ప్రవాసభారతీయులు కోరారు. 

అమెరికాలో ఉన్న భారతీయులు, హిందువులు అందరూ ట్రంప్ సర్కార్ చేపడుతున్న సంస్కరణలకు పూర్తి మద్దతు తెలిపారు. ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదంతో వారు కూడా గొంతు కలిపారు. అన్ని రంగాలలో అమెరికాను అగ్రస్థానంలో నిలబెట్టడానికి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు, తీసుకొంటున్న నిర్ణయాలకు వారు పూర్తి మద్దతు తెలిపారు. ప్రవాస భారతీయులు అందరూ ట్రంప్ కు బాసటగా నిలుస్తామని నినాదాలు చేశారు. అయితే అమెరికా అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్న తమకు, తమ పిల్లల స్వేచ్చకు, హక్కులకు, భవిష్యత్ కు భంగం కలగకుండా సంస్కరణలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష ఎన్నికలలో సుమారు 47 శాతం మంది అమెరికన్లు డోనాల్డ్ ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న సమయంలో ఆయనకు అండగా ప్రవాస భారతీయులు నిలబడ్డారు. కనుక వారి అభ్యర్ధనలను అయన మన్నిస్తారో లేదో చూడాలి.


Related Post