ప్రవాస తెలంగాణా వైద్యునికి అరుదైన పురస్కారం

January 30, 2018
img

తెలంగాణా రాష్ట్రానికి చెందిన డాక్టర్ ధర్మపురి విద్యాసాగర్ అమెరికాలో నవజాత శిశువైద్యనిపుణుడిగా మంచి పేరున్నవారు. ఆయనకు అమెరికాలో హాల్ ఆఫ్ ఫేం సంస్థ ‘లెజెండ్ ఆఫ్ నియోనాటాలజీ’ అనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రధానం చేసింది. డాక్టర్ ధర్మపురి విద్యాసాగర్ కరీంనగర్ జిల్లా చెంజెర్లకు చెందినవారు. అయన 1961లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ చేసి 1963లో అమెరికా వెళ్ళి పిట్స్ బర్గ్ ఆసుపత్రిలో శిశువైద్యునిగా చేరారు. ఆ తరువాత ఇల్లీనాయిస్ యూనివర్సిటీలో భోధనావృత్తిని చేపట్టారు. నియోనాటల్ రంగంలో స్వయంగా అనేక పరిశోధనలు చేయడమే కాకుండా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి చెందిన అనేకమంది వైద్యులను అమెరికాకు తీసుకువెళ్ళి వారి చేత పరిశోధనలు చేయించారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పిల్లల కోసమే అత్యవసర వార్డును ప్రారంభింపజేశారు. సుమారు 30 సం.ల క్రితమే దేశంలో మొట్టమొదటి నియోనాటలజీ రీసర్చ్ ప్రోగ్రాంను డాక్టర్ విద్యాసాగర్ ప్రారంభించారు. 

నవజాత శిశువైద్యంలో ఆయనందించిన సేవలకు, అద్వితీయమైన ఆయన ప్రతిభకు గుర్తింపుగా భారత్, పోలెండ్, అమెరికాలలోని ప్రముఖ సంస్థలు ఆయనకు అనేక అవార్డులు ప్రధానం చేశాయి. ఆయన తాజాగా అందుకొన్న ఈ ‘లెజెండ్ ఆఫ్ నియోనాటాలజీ అవార్డు’ తో భారతదేశానికి, తెలంగాణా రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. 


Related Post