హెచ్-1 బి వీసాలపై వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్

January 09, 2018
img

హెచ్-1 బి వీసాల రెన్యువల్ విషయంలో సర్వత్రా ఎదురవుతున్న వ్యతిరేకతను చూసి ట్రంప్ సర్కార్ వెనక్కు తగ్గింది. అమెరికాలో శాశ్వితనివాసం కోసం ఇచ్చే గ్రీన్ కార్డ్ కు దరఖాస్తు చేసుకొన్నవారికి అది మంజూరు అయ్యేలోగా ఎన్నిసార్లైనా హెచ్-1 బి వీసా రెన్యువల్ చేసుకొనే వెసులుబాటు ఉంది. 17 ఏళ్ళ క్రితం అమెరికాలో ఐటి, వైద్య తదితర రంగాలలో నైపుణ్యం కలిగినవారి కోసం హెచ్-1 బి వీసా పద్దతిని అమలులోకి తీసుకువచ్చారు. కానీ అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తరువాత ‘బై అమెరికా..హైర్ అమెరికన్’ పాలసీని అమలు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఆ ప్రయత్నాలలో భాగంగానే హెచ్-1 బి వీసాల మంజూరుకు ఆంక్షలు కటినతరం చేశారు. దానిలో భాగంగానే అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారిని కూడా తగ్గించుకొనేందుకు, హెచ్-1 బి వీసాను గరిష్టంగా రెండుసార్లు మాత్రమే రెన్యువల్ చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ దేశం నుంచి ఒకేసారి వేలు లక్షలమంది నిపుణులను స్వదేశాలకు తిప్పి పంపించివేసినట్లయితే, ఆయా రంగాలు కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరించారు. ఆ ప్రతిపాదన వలన అమెరికాకు లాభం కంటే నష్టమే ఎక్కువని హెచ్చరించడంతో ట్రంప్ సర్కార్ వెనక్కు తగ్గింది. కనుక ఆ ప్రతిపాదనను విరమించుకొంటున్నట్లు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) సోమవారం ప్రకటించింది. కనుక గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నవారికి చాలా ఉపశమనం లభించినట్లే చెప్పవచ్చు.

Related Post