పారిస్ లో 22మంది భారత్ మైనర్లు మిస్సింగ్?

December 30, 2017
img

ఏడాది క్రితం జరిగిన ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అది చాలా కలవరిచేదిగా ఉంది. గత ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన పంజాబ్ లోని కపుర్తాల పట్టణంలో వివిధ పాఠశాలలలో చదువుకొంటున్న 13-18 ఏళ్ళ లోపున్న 25 మంది విద్యార్ధులు (అందరూ అబ్బాయిలే) రగ్బీ ఆటలో శిక్షణ పొందేందుకు  ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరం వెళ్ళారు. వారిలో 22 మంది మైనర్లు అదృశ్యమైనట్లు తాజా సమాచారం. వారిలో ఒకరు రోడ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఫ్రాన్స్ పోలీసులు పట్టుకొని విచారించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ పోలీసులు ఇంటర్ పోల్ కు, భారత ప్రభుత్వానికి ఈవిషయం తెలియజేశారు.

ఫ్రాన్స్ పోలీసుల నుంచి అందిన సమాచారం ఆధారంగా సిబిఐ మొన్న గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించగా, వారందరినీ ఏడాది క్రితం డిల్లీలోని సంజీవ్ రాయ్,వరుణ్ చౌదరి, ఫరీదాబాద్ లోని లలిత్ డేవిడ్ అనే ముగ్గురు దళారులు విజిటర్స్ వీసాపై డిల్లీ నుంచి పారిస్ కు పంపించినట్లు తెలిసింది. అందుకోసం వారి తల్లితండ్రుల దగ్గర నుంచి ఒక్కొక్కరికీ రూ.25-30 లక్షలు వారు వసూలు చేసినట్లు సిబిఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ చెప్పారు.

ఆ విద్యార్ధులు పారిస్ చేరుకొన్న తరువాత స్థానిక గురుద్వారాలో వారికి బస ఏర్పాటు చేశారు. వారు  కొన్ని రోజులు అక్కడ రగ్బీ శిక్షణలో పాల్గొన్నారని తెలిసింది. అయితే వారిని అక్కడకు పంపిన బ్రోకర్లు వారి రిటర్న్ జర్నీ టికెట్లు క్యాన్సిల్ చేసారని తేలింది. 

అటువంటి సమస్య ఏదో తలెత్తబోతోందని ముందే పసిగట్టిన ఒక విద్యార్ధి వెంటనే భారత్ తిరిగి వచ్చేశాడు. మిగిలిన వారందరూ అప్పటి నుంచి కనబడకుండా పోయారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఆ పిల్లల తల్లితండ్రులు ఇంతవరకు పోలీసులకు పిర్యాదు చేయకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫ్రాన్స్ పోలీసులు తమ ప్రభుత్వం ద్వారా భారత్ సర్కార్ కు తెలియజేసేంత వరకు ఈ విషయం మీడియాకు కూడా తెలియకపోవడం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. సిబిఐ అధికారులు దీనిని పిల్లల అక్రమ రవాణా కేసుగా నమోదు చేసుకొని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. 

ఏడాది క్రితం పిల్లలు అదృశ్యమైతే వారి తల్లితండ్రులు ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఎందుకు తెలియజేయకుండా దాచిపెట్టారో? రగ్బీ శిక్షణకని విజిటింగ్ వీసాపై పారిస్ వెళ్ళిన పిల్లలు తిరిగిరానప్పుడు, భారత్, ఫ్రాన్స్ ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి రాకపోవడం అన్నీ విచిత్రంగానే ఉన్నాయి. ఏడాది క్రితం పారిస్ వెళ్ళిన 22 మంది పిల్లలు ఏమయ్యారు? ఇప్పుడు ఎక్కడున్నారు? వారు క్షేమంగా ఉన్నారా? అనే ప్రశ్నలకు సిబిఐ దర్యాప్తుల సమాధానాలు దొరుకుతాయని ఆశిద్దాం.

Related Post