విదేశాలలో ఇద్దరు తెలంగాణావాసులు మృతి

December 28, 2017
img

మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు తెలంగాణావాసులు విదేశాలలో మరణించారు. వారిలో కోన ఆదినారాయణ రెడ్డి (36) ఇన్ఫోసిస్ ఉద్యోగి కాగా సయీద్ అబ్దుల్ రహీం ఫహాద్ (29) విద్యార్ధి. 

సూర్యాపేట జిల్లా ఇంజమ్మవారిగూడెం గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి ఆరు నెలల క్రితమే కంపెనీ పని మీద ఆస్ట్రేలియాలో సిడ్నీకి వెళ్ళారు. అక్కడే పనిచేస్తూ తన సహోద్యోగులతో కలిసి ఒక ఫ్లాట్ లో ఉంటున్నారు. డిసెంబర్ 25వ తేదీన ఆయన భార్య శిరీష, అయన తల్లితండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆదినారాయణ రెడ్డి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వారికి అనుమానం వచ్చి అయన రూమ్మేట్స్ కు ఫోన్ చేశారు. వారు వెంటనే ఫ్లాట్ కు వెళ్ళి చూడగా అయన అప్పటికే మరణించిఉన్నారు. ఈ విషాదకర సంఘటన డిసెంబర్ 25 రాత్రి 10 గంటలకు జరిగినట్లు తెలుస్తోంది. తన భర్తకు వారం రోజుల క్రితమే గుండెపోటు వచ్చిందని దానికి చికిత్స తీసుకొన్నారని తెలిపింది. బహుశః మళ్ళీ గుండెపోటు వచ్చినందునే అయన చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆ దంపతులకు మూడేళ్ళు వయసున్న కవల ఆడ పిల్లలున్నారు. ఆమె తన పిల్లలతో కలిసి అత్తమామల వద్ద మిర్యాలగూడాలో ఉంటున్నారు.

ఇక సయీద్ అబ్దుల్ రహీం ఫహాద్ రెండేళ్ళ క్రితం న్యూజిలాండ్ వెళ్ళి అక్కడ ఆక్ లాండ్ యూనివర్సిటీలో చదువుకొంటున్నాడు. అతని తల్లితండ్రులు మధ్యతరగతి కుటుంబస్తులు కావడంతో సయీద్ అబ్దుల్ పగలు యూనివర్సిటీలో చదువుకొంటూ రాత్రిళ్ళు ట్యాక్సీ నడిపిస్తూ తన ఖర్చులకు అవసరమైన డబ్బు సంపాదించుకొనేవాడు. అతను మూడు రోజుల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చనిపోయాడు. చేతికి అందివచ్చాడనుకొన్న కొడుకు ఇలాగ అర్ధాంతరంగా దేశం కాని దేశంలో చనిపోవడంతో అతని తల్లితండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వారి కుటుంబం హైదరాబాద్ లో నివసిస్తోంది. 

ఆదినారాయణ రెడ్డి, సయీద్ అబ్దుల్ మృతదేహాలను వీలైనంత త్వరగా హైదరాబాద్ రప్పించేందుకు విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ ప్రయత్నాలు చేస్తున్నారు.

Related Post