వరల్డ్ ఫేమస్ లవర్ : రివ్యూ

February 14, 2020
img

అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బైలింగ్వల్ నోటా ఫ్లాప్ అయినా టాక్సీవాలా హిట్ అందుకున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన డియర్ కామ్రేడ్ నిరాశపరచగా వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయగా.. కె.ఎస్ రామారావు నిర్మించారు. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జాబ్ చేస్తున్న టైం లో యామిని (రాశి ఖన్నా) ప్రేమలో పడతాడు గౌతం (విజయ్ దేవరకొండ). పర్సనల్ గా రైటర్ గా మారాలనే కోరిక ఉన్న గౌతం యామిని కోరిక మేరకు జాబ్ లో జాయిన్ అవుతాడు. అయితే ఒకానొక టైం లో అతను జాబ్ మానేసి రైటర్ గా కథ రాస్తానని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. ఇంట్లో వారి ప్రేమకు ఒప్పుకోలేదని గౌతం తోనే కలిసి ఉంటుంది యామిని. ఇలాంటి టైంలో సడెన్ గా యామిని గౌతం లోని మార్పుని గమనించి అతనికి బ్రేకప్ చెప్పి వెళ్తుంది. అలాంటి టైంలో గౌతం ఒక కథ రాయాలని అనుకుంటాడు. అపుడే అతనికి తను హైదరాబాద్ లో పుట్టడం వల్ల యామిని దొరికింది.. అదే ఇల్లందులో పుడితే అంటూ శీనయ్య, సువర్ణల కథ రాస్తాడు..? ఆ తర్వాత యామినికి లైఫ్ ఇద్దామని తన ప్యారిస్ ఆఫర్ వదులుకున్న గౌతం.. అక్కడకు వెళ్తే తన లైఫ్ ఎలా ఉండేదో అంటూ కథ రాస్తాడు..? ఇలా వరల్డ్ ఫేమస్ లవర్ పుస్తకం పూర్తి చేసే దశలో ముగింపు రాయకుండానే జైలుకు వెళ్తాడు..? ఇంతకీ గౌతం పుస్తకం ముగింపు ఏంటి..? గౌతం, యామిని ప్రేమకథ ముగిసింది..? అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ఓ గొప్ప ప్రేమికుడి కథ చెబుతాడని ఊహించి వెళ్లిన ఆడియెన్స్ కు షాక్ ఇచ్చాడు డైరక్టర్ క్రాంతి మాధవ్. విజయ్ లాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ను సరిగా వాడుకోలేదు. కథ వరకు బాగానే రాసుకున్న క్రాంతి మాధవ్ కథనంలో పూర్తిగా ట్రాక్ తప్పాడు. సినిమా స్టార్టింగ్ చాలా బాగా రాసుకున్నా రాను రాను సాగదీతగా అనిపిస్తుంది. ఇల్లెందులో జరిగే శీనయ్య, సువర్ణ ఎపిసోడ్ కాస్త రిలీఫ్ అనిపిస్తుంది.

ఇక సెకండ్ హాఫ్ కూడా అంతా బోరింగ్ గా సాగుతుంది. సినిమా మీద అంచనాలు పెంచడం.. మరీ రొటీన్ స్క్రీన్ ప్లేతో సాగదీతగా సినిమా తీయడంతో సినిమా చూస్తున్న ఆడియెన్స్ పేషెన్సీకి టెస్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. వాటితో పాటుగా పేలవమైన సీన్స్ కూడా ఉన్నాయి. 

అసలు హీరో రాసింది అంత గొప్ప ప్రేమకథ కానేకాదు.. దానికి ముగింపు కోసం అతను జైలు నుండి వచ్చేంతలా వెయిట్ చేయడం లాంటివి చాలా సిల్లీగా అనిపిస్తాయి. పోనీ సినిమా ఏమన్నా ఎంగేజింగ్ గా నడిపించాడా అంటే డైరక్టర్ అంతా కన్ ఫ్యూజన్ స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. మంచి కాస్టింగ్.. మంచి కథని ఇంకాస్త బాగా తీసి ఉంటే ఫలితం వెరేలా ఉండేదని చెప్పొచ్చు. 

నటన, సాంకేతికవర్గం పనితీరు :

గౌతం పాత్రలో విజయ్ దేవరకొండ మరోసారి తన సత్తా చాటాడు. గౌతం, శీనయ్య పాత్రల్లో విజయ్ వేరియేషన్ బాగా చూపించాడు. ఇక సినిమాలో రాశి ఖన్నా తన నటనతో మెప్పించింది. ఐశ్వర్యా రాజేష్ కూడా సువర్ణ పాత్రలో ఇంప్రెస్ చేసింది. కేథరిన్, ఇజా బెల్లా పాత్రలు పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రియదర్శి, జయరాం పాత్రలు సోసోగా అనిపిస్తాయి. 

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అలరించింది. సినిమాలో కెమెరా వర్క్ నీట్ గా ఉంది. గోపి సుందర్ మ్యూజిక్ పెద్దగా మెప్పించలేదు. ఈ సినిమా మైనస్ లలో మ్యూజిక్ కూడా ఒకటని చెప్పొచ్చు. డైరక్టర్ క్రాంతి మాధవ్ కథ బాగానే రాసుకున్నా కథనం విషయంలో పూర్తిగా ట్రాక్ తప్పాడు. కె.ఎస్ రామారావు ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో : 

వరల్డ్ ఫేమస్ లవర్.. అంత ఫేమస్ అయ్యే ప్రేమకథ అయితే కాదు..!

రేటింగ్ : 2/5


Related Post