జాను : రివ్యూ

February 07, 2020
img

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన 96 మూవీని తెలుగులో జానుగా రీమేక్ చేశారు దిల్ రాజు. మాత్రుక దర్శకుడు ప్రేమ్ కుమార్ జానుని డైరెక్ట్ చేశారు. శర్వానంద్, సమంత జంటగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

కె. రామచంద్ర అలియాస్ రాం (శర్వానంద్) ఎస్.జానకి దేవి అలియాస్ జాను (సమంత) స్కూల్ ఏజ్ లో ఒకరినొకరు ఇష్టపడిన వీరు 10వ తరగతి పూర్తి చేసుకున్న తర్వాత విడిపోతారు. జానుని వదిలి కుటుంబ పరిస్థితులు బాగా లేక రాం ఫ్యామిలీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. అలా రామ్ కోసం ఎంత వెతికినా లాభం లేక ఇంట్లో వాళ్ళ బలవంతం వాళ్ళ వేరే వాళ్ళని జాను పెళ్లి చేసుకుంటుంది. ఇక 17 ఏళ్ల తర్వాత తన స్నేహితులతో గెట్ టూ గెదర్ ప్లాన్ చేసుకున్న రామ్ మళ్లీ జానుని కలుస్తాడు. విద్యార్ధుల సమ్మేళనం వేడుక తర్వాత ఇద్దరు తమ జీవితంలో జరిగిన సంఘటనల గురించి చర్చించుకుంటారు. ఇద్దరు నవ్వుకుంటారు..? బాధపడతారు..? ఏడుస్తారు..? అభిమానించుకుంటారు.. ఇలా తెల్లారితే జాను వెళ్తుందనే కారణంతో ప్రతి నిమిషం గొప్ప అనుభూతిని కలిగేలా చేస్తాడు రామ్. ఇది ప్రేమ కథ.. ఇదే 'జాను' కథ. 

విశ్లేషణ :

రామ్, జాను విడిపోవడం.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత కలవడం సన్నివేశాలు హృదయాన్ని పిండేసేలా ఉంటాయి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా కనెక్ట్ అవుతుంది. స్కూల్ ఏజ్ లవ్ లోని ఫ్రెష్ నెస్ దర్శకుడు బాగా చూపించాడు. ఫస్ట్ హాఫ్ బాగుంది.. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినట్టు అనిపిస్తుంది. తమిళ 96 మూవీని యాజిటీజ్ దించేశారని చెప్పొచ్చు.    

ఆ సినిమా చూడని వారికి ఈ సినిమా నచ్చేస్తుంది.. ఆ సినిమా చూసి కనెక్ట్ అయిన వారికి ఇంకా బాగా ఈ సినిమా హృదయాన్ని తాకుతుంది. అన్నివిధాలుగా అనుకున్న సబ్జెక్ట్ ను అనుకున్న విధంగా తీయగలిగాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఒకే సినీమను రెండు భాషల్లో ఒకే అనుభూతి కలిగేలా చేయడం గొప్ప విషయం.  

జాను కేవలం యూత్ ఆడియెన్స్ కు మాత్రమే అనుకోవచ్చు. యూత్ బాగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నా ఇది ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే సినిమా అని చెప్పొచ్చు. సినిమా చూసిన ఆడియెన్స్ అందరు తన పాత ప్రేమకథలను ప్రేయసిని గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అక్కడే దర్శకుడు సక్సెస్ అయినట్టు లెక్క. సినిమా క్లైమాక్స్ కూడా హృదయం బరువెక్కేలా చేస్తుంది. ఏ సెంటర్స్ సూపర్ అనిపించేలా ఉన్న ఈ మూవీ బి, సి సెంటర్స్ లో కొద్దిగా నిరాశ చెందక తప్పదు.

నటన, సాంకేతికవర్గం :

తెలుగులో 96 రీమేక్ అనగానే అందరు ఆలోచించారు. జానుని చూసి రీమేక్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. కొన్ని కథలే ఆ సినిమాకు కావాల్సిన నటులను ఎంపిక చేసుకుంటుంది అని చెప్పినట్టుగా.. జాను సినిమాకు శర్వానంద్, సమంతలు మాత్రమే న్యాయం చేయగలరని అనిపిస్తుంది. శర్వానంద్ రాం పాత్రలో అద్భుతంగా చేశాడు. సమంత అయితే జానకికి ప్రాణం పోసింది. ఇక మిగతా వారంతా కూడా బాగానే చేశారు.

టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మహేంద్ర జయరాజు సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేం చాలా అందంగా ఉంది. గోవింద్ వసంత మ్యూజిక్ సినిమాకు మరో అసెట్ అని చెప్పొచ్చు. సంగీతంతో హృదయాన్ని కదిలించొచ్చు అనే మాట ఈ సినిమాలోని ప్రతి పాట, బిజిఎం విని చెప్పొచ్చు. సన్నివేశం యొక్క స్థాయిని పెంచేలా వసంత్ మ్యూజిక్ ఉంది. ప్రేమ్ కుమార్ డైరక్షన్ టాలెంట్ మరోసారి తెలుగులో కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

'జాను' ఒక సక్సెస్ ఫుల్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ..!  

రేటింగ్ : 3.5/5


Related Post