అల వైకుంఠపురములో : రివ్యూ

January 12, 2020
img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వచ్చిన సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన రామచంద్ర (జయరాం).. రామచంద్రతో పనిచేసే వాల్మీకి (మురళి శర్మ) ఇద్దరు ఒకేసారి తండ్రి అవుతారు. వాల్మీకి తన కొడుకు రాజులా బ్రతకాలని ఆలోచించి రాంచంద్ర భార్య దగ్గర తన కొడుకుని పెడతాడు. ఇక రామచంద్ర కొడుకుని తన భార్య దగ్గర పెడతాడు. పాతికేళ్లుగా ఈ నిజం దాచిపెడుతూ.. జయరాం ఇళ్లైన వైకుంఠపురములోకి తను పెంచే కొడుకుని అడుగు కూడా పెట్టనివ్వడు. అయితే విషయం తెలుసుకున్న బంటు (అల్లు అర్జున్) తను ఉండాల్సింది రాజు కోటలో అని నిర్ణయించుకుంటాడు. వాల్మీకి చేతే తనని రప్పించే ఏర్పాటు చేసి వైకుంఠపురములో ఉన్న కొన్ని సమస్యలను సాల్వ్ చేస్తాడు.. ఇదే ఎలా జరిగింది అన్నదే సినిమా కథ.

విశ్లేషణ :

అజ్ఞాతవాసితో నిరాశ పరచిన త్రివిక్రం అరవింద సమేత తన పరిధి దాటి సినిమా తీశాడని చెప్పొచ్చు. ఇక మళ్లోసారి తన మార్క్ లో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే అల వైకుంఠపురములో. కథ కొత్తగా లేకున్నా కథనంలో తన సత్తా చూపించాడు. బన్ని స్టైల్, త్రివిక్రం మాటలు.. మెగా ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సిని ప్రియులకు పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీగా అల వైకుంఠపురములో వచ్చింది.

ఎంటర్టైనింగ్.. ఎమోషన్.. క్లాస్ మాస్ ఇలా అన్నివర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కథగా చెప్పుకుంటే ముందు చెప్పినట్టుగా అంత గొప్ప కథ కాకున్నా స్క్రీన్ ప్లే మాత్రం త్రివిక్రమ చాలా నీట్ గా తీశాడు. ఇక జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మరో హిట్ మూవీగా నిలిచింది.

అల వైకుంఠపురములో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగగా.. ఫస్ట్ హాఫ్ లోనే సామజవరగమన సాంగ్, బుట్ట బొమ్మ సాంగ్స్ వస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో రాములో రాములా, అల వైకుంఠపురములో టైటిల్ సాంగ్ అదరగొట్టాయి. ముఖ్యంగా అందరి హీరోల పాటలను చేస్తూ అల్లు అర్జున్ చేసిన ఆ ఎపిసోడ్ మాతం సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సంక్రాంతికి అసలు సిసలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వచ్చింది.

నటన, సాంకేతిక వర్గం :

అల్లు అర్జున్ బంటు పాత్రలో అదరగొట్టేశాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా తన నటన ఉంది. స్టైలిష్ స్టార్ స్క్రీన్ నేం కు సరైన ఆన్సర్ ఇచ్చాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా వావ్ అనిపించాడు. ఇక సినిమాలో హీరోయిన్ పూజా హెగ్దె తన గ్లామర్ తో ప్రేక్షకులను మెప్పించింది. టబు, జయరాం పాత్రలు అలరించాయి. సచిన్, వెన్నెల కిశోర్, నివేదా పేతురాజ్, సుశాంత్ ఇలా అందరు తమ పాత్రలతో మెప్పించారు. ముఖ్యంగా సినిమాలో వాల్మీకిగా నటించిన మురళి శర్మ మాత్రం వర్సెటైల్ నటనతో మెప్పించాడు.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. పి.ఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్ రిలీజ్ ముందే సినిమాకు మ్యూజిక్ తోనే ఒక లెవల్ సెట్ చేశాడు థమన్. ఇక సినిమాలో తన సాంగ్స్, బిజిఎం తో బొమ్మ అదిరిపోయేలా చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్ గా ఉన్నాయి. త్రివిక్రం మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించాడు. 

ఒక్కమాటలో :

అల వైకుంఠపురములో.. సంక్రాంతికి పర్ఫెక్ట్ బొమ్మ..!

రేటింగ్ : 3.5/5


Related Post