ప్రతిరోజూ పండగే : రివ్యూ

December 20, 2019
img

మెగా హీరో సాయి తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ప్రతిరోజూ పండగే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్మించారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్న్ మ్యూజిక్ అందించారు. ఈరోజు రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి మైతెలంగాణా సమీక్షలో చూద్దాం.

కథ :

రఘురామయ్య (సత్య రాజ్) రాజమండ్రిలో నివసిస్తూ ఉంటాడు. అతనికి లంగ్ క్యాన్సర్ అని తెలుసుకుంటాడు. మహా అయితే ఐదు వారాల్లో అతను మరణిస్తాడని డాక్టర్స్ చెబుతారు. ఆ విషయం కొడుకులు, కూతుళ్లకు చెబుతాడు. ఒక్కొక్కరు ఒక్కోదేశంలో ఉంటున్న వారు వారి పనుల ఒత్తిడిలో చివరి 2 వారాలు తండ్రి చనిపోయిన మరో రెండు వారాలు అంటే మొత్తం నాలుగు వారాలు మాత్రమే ఉండేలా రాజమండ్రి వస్తారు. అయితే తాత చనిపోతాడని తెలుసుకున్న వెంటనే ఇండియా బయలుదేరుతాడు మనవడు సాయి తేజ్. తాత ఇప్పటివరకు చేయాలనికుని చేయలేని పనులను చేయిస్తూ అతన్ని ఆనందంగా ఉంచాలని అనుకుంటాడు. అయితే చివరి రెండు వారాలకు వచ్చిన కొడుకులు, కూతురు, వారి పిల్లలకు అనుమానం కలిగేలా రఘురామయ్య ప్రవర్తన ఉంటుంది. అప్పటికే తాత చనిపోయేలోపే మనవడి పెళ్లి చూడాలని అనగా సాయి తేజ్ అక్కడ ఉన్న తన స్నేహితుడి మనవరాలు ఏంజెల్ ఆర్నాని లవ్ లో పడేసి వారి ఫ్యామిలీని ఒప్పిస్తాడు. ఇంతకీ రఘు రామయ్య చివరి రోజుల్లో ఎలా ఉన్నాడు..? అతని కొడుకులు, కూతుళ్లు ఆయన్ను ఎలా చూసుకున్నారు..? రఘురామయ్య పట్ల వారికి ఉన్న ప్రేమ ఎలాంటిది అన్నది సినిమా కథ.

విశ్లేషణ :

మారుతి తన డైరక్షన్ లో వచ్చే సినిమా కథలను ముందే చెప్పి వాటికి కథనం అల్లుతాడు. అన్ని సినిమాల్లానే ప్రతిరోజూ పండగే సినిమాకు కూడా తాత చనిపోతాడని ఊరు వచ్చిన మనవడు. తండ్రి మరణిస్తాడని తెలిసి అక్కడ వారి పనులకు ప్రాముఖ్యత ఇచ్చే విదేశాల్లో ఉండే పిల్లలు. ఇలా ముందే కథ చెప్పి కథనం కామెడీగా సాగించాడు. 

అయితే ఫారిన్ లో ఉండే వాళ్లకు ప్రేమా ఆప్యాయతలు ఉండవా అంటే ఉంటాయి కాని వారు ఉండేది పక్కన ఊళ్లోనో.. పక్కన రాష్ట్రంలోనో కాదు రావాలన్న పోవాలన్న సవాలక్ష పనులు ఉంటాయి. ఈ సినిమాలో మారుతి కొద్దిగా ఎన్నారై వారికి అసలు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదన్నట్టు చూపించాడు. అయితే సినిమాటిక్ ప్రభావం వల్ల కొద్దిగా చెప్పినా సరే అది బలంగా ఉంటుందని చెప్పొచ్చు.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగించగా సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. అయితే అది మరీ ఎమోషనల్ డ్రామాగా అనిపిస్తుంది. సినిమా ఎంటర్టైనింగ్ విషయంలో ఢోకా లేదని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరు మెచ్చేలా ఉంది ఈ సినిమా. 

నటన, సాంకేతికవర్గం ;

సాయి తేజ్ తన పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు. ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో కూడా సాయి తేజ్ నటన మెప్పించింది. రాశి ఖన్నా ఏంజెల్ ఆర్నా పాత్రలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక సినిమాలో తాత పాత్రలో నటించిన సత్యరాజ్, హీరో తండ్రి పాత్ర చేసిన రావు రమేష్ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. రావు రమేష్ అయితే తన పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టేశారు. సినిమాలో సింక్ బ్రదర్స్ గా సత్యం రాజేష్, అజయ్ ల నటన కామెడీగా ఉంటుంది. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. కెమెరా వర్క్ బాగుంది. థమన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. మారుతి తన మార్క్ ఎంటర్టైనింగ్ అందించాడు. అయితే సెకండ్ హాఫ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. 

ఒక్కమాటలో :

ప్రతిరోజూ పండగే.. ఫ్యామిలీ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3/5


Related Post